రకుల్ ఐ లవ్ యు ఎలా ఉంది

అదేంటో ఈ మధ్య స్టార్ హీరో హీరోయిన్లు నటించిన డైరెక్ట్ ఓటిటి రిలీజ్ సినిమాలు వచ్చాయనే సంగతే తెలియకుండా డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఈ వారం ఆదిపురుష్ ఉండటంతో ప్రేక్షకులు మరో ఆప్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం పడలేదు. ఈ గొడవలో సైలెంట్ గా వచ్చిన మూవీ ఐ లవ్ యు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో ఆమె బాయ్ ఫ్రెండ్ గా అక్షయ్ ఒబెరాయ్ నటించిన ఈ డిఫరెంట్ థ్రిల్లర్ కి నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహించారు. కేవలం తొంబై అయిదు నిమిషాల నిడివి మాత్రమే ఉన్న మూవీ మెప్పించేలా ఉందా

ముందు కథ సంగతి చూద్దాం. కార్పొరేట్ ఆఫీస్ లో ఉద్యోగం చేసే సత్య(రకుల్ ప్రీత్ సింగ్)కు తన కొలీగ్ విశాల్(అక్షయ్ ఒబెరాయ్) తోనే ఎంగేజ్ మెంట్ అవుతుంది. ఇద్దరూ భవిష్యత్తు గురించి ఏవేవో కలలు కంటారు. దీపావళి పండగ సందర్భంగా అందరికీ సెలవులు ఇచ్చేస్తారు. బిల్డింగ్ సెక్యూరిటీ చూసుకునే రాకేష్(పావైల్ గులాటి)తప్ప అందరూ వెళ్ళిపోతారు. అనూహ్యంగా సత్య ఒంటరిగా అక్కడ ఇరుక్కుపోతుంది. రాకేష్ సహాయం తీసుకునే క్రమంలో ఎన్నో పరిణామాలు జరుగుతాయి. ఈ ప్రమాదంలో ఆమె ఎలా ఇరుక్కుంది, ఎలా బయటపడిందనేది స్టోరీ  

చాలా తక్కువ నిడివి ఉన్నప్పటికీ ఐ లవ్ యు డీసెంట్ వాచ్ కాలేకపోయింది. ఈ తరహా సర్వైవర్ థ్రిల్లర్లు కొత్త కాకపోయినా ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ఏదో కొత్తగా ట్రై చేయాలని చూసిన నిఖిల్ మహాజన్ ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేని రాసుకోలేదు. దీంతో క్యారెక్టర్లతో ఎలాంటి ఎమోషన్ కనెక్ట్ కాక ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. రకుల్, పావైల్ లు పెర్ఫార్మన్స్ పరంగా తమ భుజాలపై నిలబెట్టే ప్రయత్నం చేసినా అందులో పూర్తిగా సఫలం కాలేకపోయారు. ఎంతో ఖాళీ సమయం ఉండి రకుల్ వీరాభిమానులు అయితే తప్ప ఐ లవ్ యు మీ గంటన్నర సమయానికి న్యాయం చేకూర్చదు