వరల్డ్ బెస్ట్ ఫిలిం మేకర్స్ లో టాప్ 3 లిస్టు తయారు చేస్తే అందులో ఖచ్చితంగా ఉండే పేరు జేమ్స్ క్యామరూన్. వయసు ఎంత మీద పడుతున్నా సరే అవతార్ ని అయిదు భాగాల్లో ప్రేక్షకులకు అందించడం కోసం ఆయన పడుతున్న తాపత్రయం ఎందరో దర్శకులకు స్ఫూర్తి పాఠం. ఒక పదేళ్ల కెరీర్ పూర్తవ్వగానే క్రియేటివిటీ అడుగంటిపోయి నాసిరకం కథలతో డిజాస్టర్లు ఇస్తున్న డైరెక్టర్లు ఆయన దగ్గర క్లాసులు తీసుకోవడం ఉత్తమం. అవతార్ ఇప్పటిదాకా రెండు భాగాలు వచ్చి వసూళ్లలో అగ్ర స్థానాల్లో నిలుచున్న సంగతి తెలిసిందే. టైటానిక్ కూడా ఈయన అద్భుత సృష్టే
బ్యాలన్స్ ఉన్న మూడు భాగాలూ వాస్తవానికి వచ్చే ఏడాది నుంచి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ అవిప్పుడు వాయిదా పడ్డాయి. అవతార్ 3 డిసెంబర్ 2025, అవతార్ 4 అదే నెల 2029, అవతార్ 5 సేమ్ డేట్ 2031లో వస్తాయి. అంటే 2009 లో రిలీజైన ఫస్ట్ పార్ట్ నుంచి లెక్క బెట్టుకుంటే ఒకే కథను విస్తరిస్తూ జేమ్స్ క్యామరూన్ 22 సంవత్సరాలు ఖర్చు పెట్టేశారు. ఇతర దిగ్దర్శకులు ఎన్నో సీక్వెల్స్ వేరే సినిమాలకు తీశారు కానీ దేనికీ ఇంత క్రేజ్ రాలేదన్న మాట వాస్తవం. అవతార్ ఫైనల్ పార్ట్ వచ్చే నాటికి క్యామరూన్ వయసు 76 చేరుకుంటుంది.
అయినా సరే తగ్గేదేలే అంటున్నారు. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ చూసి రాజమౌళిని ప్రత్యేకంగా ప్రశంసించిన క్యామరూన్ జక్కన్నకు హాలీవుడ్ వచ్చే ప్లాన్ ఉంటే కలిసి చేద్దామని కూడా హామీ ఇచ్చారు. నిజంగా ఇలాంటి క్రియేటివ్ జీనియస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పండోరా అనే ఊహకందని ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షక లోకం మొత్తం విభ్రాంతి చెందేలా విజువల్ ఎఫెక్ట్స్ ని చూపించిన తీరు గురించి పుస్తకాలు ఎన్ని రాసినా సరిపోయావు. టెర్మినేటర్ తోనే ఈ మాయాజాలాన్ని మొదలుపెట్టిన ఈ వెండితెర మాంత్రికుడు అవతార్ సిరీస్ తర్వాత రిటైర్ కాబోతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు