ఆదిపురుష్‌ను వాళ్లు ఓన్ చేసుకున్నారు

బాహుబ‌లి సినిమాతో ఉత్త‌రాదిన‌ మ‌రే ద‌క్షిణాది న‌టుడికీ రాని ఫాలోయింగ్‌ను సంపాదించాడు ప్ర‌భాస్. ఇది ఆషామాషీ ఫాలోయింగ్ కాద‌ని సాహో రిలీజైన‌పుడే అంద‌రికీ అర్థ‌మైంది. ఆ సినిమాకు ఉత్త‌రాదిన క‌ళ్లు చెదిరే ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఓవ‌రాల్‌గా ఈ సినిమా డిజాస్ట‌రే అయిన‌ప్ప‌టికీ హిందీ బెల్ట్ వ‌ర‌కు పెట్టుబ‌డి రాబ‌ట్టి స‌క్సెస్ ఫుల్ సినిమాగా నిల‌వ‌డం విశేషం. ఐతే ప్ర‌భాస్ త‌ర్వాతి చిత్రం రాధేశ్యామ్‌కు మాత్రం ఇలాంటి స్పంద‌న రాలేదు. హిందీ ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఓన్ చేసుకోలేదు.

ఒక బాలీవుడ్ సినిమాలాగా దీన్ని ప్ర‌మోట్ చేసినా.. ఫ‌లితం లేక‌పోయింది. దీంతో ఉత్త‌రాదిన ప్ర‌భాస్ ఫాలోయింగ్ మీద సందేహాలు రేకెత్తాయి. ప్ర‌భాస్ పాన్ఇండియా పాలోయింగ్ బ‌లుపా వాపా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తాయి. అత‌డి త‌ర్వాతి సినిమా ఆదిపురుష్ ప‌క్కా బాలీవుడ్ ఫిలిం అయినా కూడా దీన్ని ఏమేర ఓన్ చేసుకుంటారో అన్న సందేహాలు క‌లిగాయి.

కానీ టీజ‌ర్ రిలీజైన‌పుడు నెగెటివిటీ ఉన్న‌ప్ప‌టికీ.. రిలీజ్ టైంకి మొత్తం క‌థ మారిపోయింది. ఈ సినిమా నార్త్ మార్కెట్లో ప్ర‌భంజ‌నం సృష్టించ‌బోతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ బుకింగ్స్ ఓపెన్ కావ‌డానికి టైం ప‌ట్టింది కానీ.. నార్త్ అంత‌టా మూడు రోజుల ముందే ఈ సినిమా టికెట్ల అమ్మ‌కాలు మొద‌ల‌య్యాయి. అక్క‌డ వేగంగా టికెట్లు అమ్ముడ‌వుతున్నాయి.

ఆల్రెడీ పీవీఆర్ సంస్థ ల‌క్ష టికెట్ల‌ను అమ్మేయ‌గా.. అందులో మెజారిటీ హిందీలో తెగిన‌వే. అన్ని మ‌ల్టీప్లెక్స్ ఛైన్స్‌లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుమీదున్నాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ క‌లెక్ష‌న్లు కోట్ల‌లోకి వెళ్లిపోయాయి. సింగిల్ స్క్రీన్ల‌లో కూడా స్పంద‌న బాగానే ఉన్న‌ట్లు అక్క‌డి ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ఈ సినిమా హిందీ వ‌ర‌కే తొలి రోజు రూ.25 కోట్ల‌కు త‌క్కువ కాకుండా వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు చెబుతుండ‌టం విశేషం. ఓవ‌రాల్ వ‌సూళ్లు రూ.100 కోట్ల మార్కును అందుకోవ‌చ్చు.