ఆదిపురుషా…ఇక భారమంతా నీదే స్వామి

బయ్యర్లు ఎవరిని కదిలించినా ఇదే మాట వినిపిస్తోంది. నిన్న విడుదలైన అయిదు సినిమాల్లో దేనికీ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడంతో థియేటర్లు మళ్ళీ కళ తప్పుతున్నాయి. విమానం ఉన్నంతలో డీసెంట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అంత బరువైన ఎమోషన్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు వెళ్లడం మీద సందేహాలున్నాయి. టక్కర్ మొదటి ఆటకే చేతులెత్తేయగా అన్ స్టాపబుల్ కి తీవ్రమైన నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. యునివర్సిటీని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇంటింటి రామాయణం సైతం పబ్లిక్ ని టికెట్లు కొని చూసేలా చేయలేకపోతోంది.

ఈ పరిస్థితి ఇప్పటిది కాదు. విరూపాక్షతో లాభాలు కళ్లజూశాక అక్కడి నుంచి ప్రతి వారం డిజాస్టర్ వీక్స్ వస్తూనే ఉన్నాయి. పట్టుమని ఒక్క షో హౌస్ ఫుల్ చేసేంత బొమ్మ ఏదీ రాలేదు. ఉన్నంతలో మేం ఫేమస్ చాలా నయమనిపించుకుంది. బిచ్చగాడు 2 డబ్బులైతే వచ్చాయి కానీ ఆడియన్స్ కి పూర్తి స్థాయి సంతృప్తినివ్వలేని మాట వాస్తవం. దీంతో బాక్సాఫీస్ డ్రైగా ఉంది. ముఖ్యంగా బిసి సెంటర్లలో అద్దెల సంగతి పక్కపెడితే కరెంట్ బిల్లు వస్తే చాలనుకుంటున్నారు. అందుకే జూన్ 16 ఎప్పుడు వస్తుందాని ఎగ్జిబిటర్లు కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు

ఏరియాల వారీగా బిజినెస్ డీల్స్ దాదాపుగా పూర్తయిపోయాయి.  ఆదివారం నుంచి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్  మొదలు కానుంది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో వస్తాయని అంచనా వేస్తున్నారు. ఒక్క తెలంగాణ నుంచే పాతిక కోట్ల ఎక్స్ పెక్టేషన్ నడుస్తోంది. ప్రచారం పర్వం ముగిసినప్పటికీ హైప్ విషయంలో ప్రభాస్ మూవీకి ఏ లోటు లేదు. రెండు ట్రైలర్లు, పాటలు కాగల కార్యాన్ని పూర్తి చేసి పెట్టాయి. స్టార్ హీరోలు టికెట్ల క్యాంపైన్ లో భాగమవుతున్నారు. ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇవ్వబోతున్నాయి. మిగిలినదల్లా ప్రీమియర్ షోలకు బ్లాక్ బస్టర్ టాక్ రావడమే