ఆదిపురుష్.. అంతా మన మంచికే

ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు అనుకున్న సంగతి తెలిసిందే. సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చేశాక.. అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి ఫైనల్ కాపీ రెడీ చేసే దిశగా అడుగులు వేసింది చిత్ర బృందం.

కానీ ఇంతలో ‘ఆదిపురుష్’ టీం ఊహించనిది జరిగింది. ప్రమోషన్లకు శ్రీకారం చుడుతూ రిలీజ్ చేసిన టీజర్‌ దారుణమైన రీతిలో ట్రోలింగ్‌కు గురైంది. ఐదొందల కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా ఎందుకూ కొరగాకుండా పోతుందేమో అన్న భయం కలిగింది ఒక దశలో. ఈ ట్రోలింగ్‌ను పట్టించుకోకుండా సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేసి ఉంటే మాత్రం ఆ భయాలే నిజం అయ్యేవేమో. కానీ సినిమాను వాయిదా వేయాలన్న నిర్ణయం తీసుకుని మంచి పని చేశారు.

అప్పుడున్న నెగెటివిటీకి తోడు.. సంక్రాంతికి గట్టి పోటీ మధ్య ‘ఆదిపురుష్’ను రిలీజ్ చేసి ఉంటే.. బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరిస్థితులు ఎదురయ్యేవే. తెలుగు రాష్ట్రాల్లో అయితే సినిమా మీద ఆశలు ఉండేవి కాదు. మిగతా రాష్ట్రాల్లో కూడా అప్పటి నెగెటివిటీని తట్టుకుని సినిమా నిలబడేదా అన్నది సందేహమే. సినిమాను వాయిదా వేసి గ్రాఫిక్స్, ఇతర విషయాల మీద మళ్లీ వర్క్ చేయడం.. ఒక ప్లాన్ ప్రకారం రాజకీయ నాయకులతో పాటు వివిధ వర్గాల వాళ్లను కలిసి సినిమా మీద నెగెటివిటీని తగ్గించడం.. పాటలతో పాటు కొత్త ట్రైలర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం సినిమాకు ప్లస్ అయ్యాయి.

మొత్తంగా ఇప్పుడు ‘ఆదిపురుష్’ మీద నెగెటివిటీ అంతా పోయింది. మంచి హైప్ కనిపిస్తోంది. దీనికి తోడు బాక్సాఫీస్ దగ్గర కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వేసవిలో సరైన సినిమాలు లేక ఒక వాక్యూమ్ క్రియేట్ అయింది. ఏమాత్రం పోటీ లేకుండా సోలోగా ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏలడానికి ‘ఆదిపురుష్’కు అవకాశం వచ్చింది. కాబట్టి కారణం ఏదైనప్పటికీ సినిమాను వాయిదా వేయడం ‘ఆదిపురుష్’కు ప్లస్సే అయింది.