చూస్తుంటే బాలీవుడ్ రామాయణం ఫీవర్ లో మునిగి తేలేలా ఉంది. ఆదిపురుష్ కు విడుదల ముందే వస్తున్న స్పందన, ప్రేక్షకుల్లో కలుగుతున్న ఆసక్తిని చూసి అదే కథను తాము చెప్పాలన్న తాపత్రయం ఇతర దర్శక నిర్మాతల్లో పెరిగిపోతోంది. దంగల్ లాంటి స్పోర్ట్స్ డ్రామా అద్భుతంగా తీసిన నితీష్ తివారి రఘురాముడి చరితాన్ని తీసే ప్రయత్నాల్లో ఉన్నారట. నిజ జీవిత భార్యాభర్తలు రన్బీర్ కపూర్, అలియా భట్ జంటగా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారనే వార్త ప్రస్తుతం ముంబై మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆదిపురుష్ ఫలితం ముందే ఈ న్యూస్ రావడం గమనార్హం.
ఇంకో పెద్ద ట్విస్టు ఏంటంటే రావణాసురుడిగా కెజిఎఫ్ ఫేమ్ యష్ ని ట్రై చేస్తారట. ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ సమయం ఎంత వృధా అవుతున్న లెక్కచేయని యష్ విలన్ షేడ్స్ ఉండే రావణుడిగా కనిపించడం దాదాపు అసాధ్యం. అల్లు అరవింద్, మధు మంతెనలు నిర్మాణ భాగస్వాములుగా ఉంటారని కూడా ప్రచారమవుతోంది. గతంలో ఇదే తరహాలో రకరకాల కాంబినేషన్లతో ప్రచారాలు జరిగాయి కానీ ఏవీ కార్యరూపం దాల్చలేదు. మలయాళంలోనూ ఒకరిద్దరు ప్రొడ్యూసర్లు ట్రై చేసి వర్కౌట్ కాదని సైలెంట్ అయ్యారు
ఎంత అయోధ్య ఆలయ నిర్మాణం జరుగుతున్నా మరీ ఇన్నేసి రామాయణ సినిమాలు రావడం సేఫ్ కాదు. ఎందుకంటే గ్రాఫిక్స్ ఎన్ని వాడినా మూల కథను మార్చడం అసాధ్యం. క్రియేటివ్ లిబర్టీ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఏ చిన్న పొరపాటు చేసినా మనోభావాలు దెబ్బ తింటాయి. అలాంటప్పుడు మళ్ళీ అదే గాథను తీసుకోవడం సాహసమే. ప్రస్తుతానికి ఇదంతా ప్రచారం స్టేజిలోనే ఉంది. ఆదిపురుష్ రిజల్ట్ వచ్చాక నిర్ణయం మారుతుందేమో. రన్బీర్ కపూర్ సంగతేమో కానీ పెర్ఫార్మన్స్ కోణంలో చూసుకుంటే సీతగా అలియా భట్ మంచి ఛాయస్ అయ్యేలా ఉంది.