డిజాస్టర్ మూవీ.. ఇష్టమే అంటున్న సిద్ధు

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం ‘మహాసముద్రం’పై రెండేళ్ల కిందట భారీ అంచనాలే నెలకొన్నాయి. శర్వానంద్.. సిద్దార్థ్.. అదితిరావు హైదరి.. అను ఇమ్మాన్యుయెల్.. జగపతిబాబు.. రావు రమేష్.. ఈ కాస్టింగ్ చూసి.. ట్రైలర్ కట్స్ చూసి ఒక బ్లాక్ బస్టర్ మూవీ చూడబోతున్న ఫీలింగ్ కలిగింది అందరిలో. కానీ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా ఘోరంగా విఫలమైంది. దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రం వీకెండ్లోనే చతికిలపడి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

ఈ సినిమాతో తెలుగులో మళ్లీ తనకు క్రేజ్ వస్తుందని.. రెండో ఇన్నింగ్స్‌కు మంచి పునాది పడుతుందని ఆశించిన సిద్ధుకు నిరాశ తప్పలేదు. ఐతే రిజల్ట్ తేడా కొట్టినప్పటికీ.. తనకు ‘మహాసముద్రం’ చాలా ఇష్టమైన సినిమానే అంటున్నాడు సిద్ధు. తన కొత్త చిత్రం ‘టక్కర్’ ప్రమోషన్లలో భాగంగా అతను ‘మహాసముద్రం’ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాడు.

‘మహాసముద్రం’ సినిమాకు పని చేసిన వంద మందిలో ఎవరిని అడిగినా.. ఈ సినిమా సూపర్ హిట్ అనే అన్నారని.. అందరూ సినిమాపై అంత నమ్మకంతో ఉన్నారని సిద్ధు చెప్పాడు. కానీ సినిమాకు మంచి ఫలితం రాలేదని.. అంతమాత్రాన అది చెడ్డ సినిమా అయిపోదని అతనన్నాడు. ఈ సినిమాలో స్నేహితుడి భార్యను హీరో పెళ్లి చేసుకోవడం అనే ఐడియా ప్రేక్షకులకు నచ్చలేదని, అందుకే తిరస్కరించారని సిద్ధు అభిప్రాయపడ్డాడు. ‘మహాసముద్రం’ ఇప్పటికీ తన ఫేవరెట్ ఫిలిం అని.. అజయ్ భూపతితో ఇంకో సినిమా చేయడానికి కూడా తాను సిద్ధమని.. అతడి నుంచి ‘ఆర్ఎక్స్ 100’ను మించిన సినిమాలు వస్తాయని సిద్ధు అన్నాడు. తన మరో ఫ్లాప్ సినిమా ‘చుక్కల్లో చంద్రుడు’ ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ ఫిలిం అని.. అది పదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అని చాలామంది అంటుంటారని సిద్ధు చెప్పుకొచ్చాడు.