ఆదిపురుష్ ఈవెంట్‌కు ఊహించని అతిథి

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరి దృష్టీ ‘ఆదిపురుష్’ మీదే ఉంది. ఆ మాటకొస్తే భారతీయ సినీ ప్రేక్షకులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రమిదే. ఈ నెల 16న ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. టీజర్ రిలీజైనపుడు ఈ సినిమాపై విపరీతమైన నెగెటివిటీ కనిపించగా.. ట్రైలర్ ఆ నెగెటివిటీని చాలా వరకు తగ్గించేసింది.

సినిమాకు మళ్లీ మంచి హైప్ కనిపిస్తోంది. ఈ హైప్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లేలా తిరుపతి వేదికగా మంగళవారం భారీ ఎత్తున ప్రి రిలీజ్ ఈవెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడి ఎస్వీ యూనివర్శిటీ మైదానంలో ఈ వేడుకను కనీ వినీ ఎరుగని రీతిలో చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రభాస్‌తో పాటు యూనిట్లోని ముఖ్య సభ్యులందరూ హాజరు కానున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.

కాగా ‘ఆదిపురుష్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఎవరూ ఊహించని ఒక విశిష్ట అతిథి రాబోతున్నారు. ఆయనే.. ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి. ఒక సినిమా వేడుకకు ఇలాంటి అతిథి రావడం అరుదైన విషయమే. ఈ వేడుకలో ప్రభాస్ తర్వాత అందరి దృష్గినీ ఆకర్షించేది ఆయనే అనడంలో సందేహం లేదు. ‘ఆదిపురుష్’ రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో.. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా హిందువులందరికీ చేరువ చేసేందుకు చిత్ర బృందం గట్టి ప్రయత్నమే చేస్తోంది.

టీజర్ రిలీజైనపుడు హిందూ మద్దతుదారుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ సహా అన్ని విషయాల్లోనూ కరెక్షన్లు చేయడమే కాక.. ఈ సినిమాను వ్యతిరేకించిన కొందరు రాజకీయ నాయకులను కూడా చిత్ర బృందం కలిసి సినిమాకు సపోర్ట్ తెచ్చుకుంది. ఇప్పుడు చినజీయర్ స్వామి లాంటి వ్యక్తిని ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా పిలిచిన హిందువుల్లో సినిమా పట్ల మరింత సానుకూలత తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.