అప్పుడు గౌరవం.. ఇప్పుడు అహింస

మామూలుగా ఓ పెద్ద కుటుంబం నుంచి ఓ యువ కథానాయకుడు అరంగేట్రం చేస్తున్నాడంటే ఉండే హంగామానే వేరు. కానీ దగ్గుబాటి కుటుంబం నుంచి తెరంగేట్రం చేసిన అభిరామ్ విషయంలో అసలు సందడే కనిపించడం లేదు. తన తొలి చిత్రం ‘అహింస’కు ముందు నుంచి బజ్ లేదు. రిలీజ్ ముంగిట కూడా ఆశించిన స్థాయిలో ప్రమోషనల్ హంగామా కనిపించలేదు.

ప్రి రిలీజ్ ఈవెంట్ ఎక్కడో చీరాలలో పెట్టి మమ అనిపించారు. హైదరాబాద్‌లో ఒక ప్రెస్ మీట్ కూడా అలాగే సాగిపోయింది. ఇక రిలీజ్ తర్వాత అయితే సినిమాను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. రామానాయుడి మవనడు అంటే.. ఇండస్ట్రీలో ప్రముఖులంతా తనకు ఆల్ ద బెస్ట్ చెప్పడం.. ప్రమోషన్లలో భాగంగా బైట్స్ ఇవ్వడం.. రిలీజ్ తర్వాత రకరకాల మార్గాల్లో సినిమాను ప్రమోట్ చేయడం ఇలాంటివేమీ జరగలేదు. నిర్మాత సురేష్ బాబు తీరు చూస్తుంటే.. ఈ సినిమా జనాల దృష్టిలో పడకుండా వెళ్లిపోతే బాగుండు అన్నట్లు కనిపిస్తోంది.

ఇంతకుముందు అల్లు శిరీష్ అరంగేట్రం విషయంలో మెగా ఫ్యామిలీ కూడా ఇదే శైలిని అనుసరించింది. తన తొలి చిత్రం ‘గౌరవం’ ఔట్ పుట్ చూసి అల్లు అరవింద్ ఈ సినిమా ఆడదని ముందే ఫిక్సయినట్లు కనిపించింది. దీంతో ఆ సినిమాను సరిగా ప్రమోట్ చేయలేదు. శిరీష్ డెబ్యూ గురించి చర్చే లేకుండా చూశారు. మెగా ఫ్యాన్స్ ఎవ్వరూ కూడా ఆ సినిమాను ఓన్ చేసుకోలేదు. మొక్కుబడిగా ఆ చిత్రాన్ని రిలీజ్ చేయించారు.

జనాలు దాని గురించి మాట్లాడుకునేలోపు థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. డెబ్యూ సినిమా వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అనుకున్నపుడే ఇలా చేస్తారు. సరిగ్గా సురేష్ బాబు సైతం తన చిన్న కొడుకు సినిమా ఫైనల్ రష్ చూశాక.. దీని మీద ఆశలు వదులుకున్నట్లున్నారు. ఈ సినిమా ఆడే అవకాశాలు లేవని.. పైగా తన కొడుకు పెర్ఫామెన్స్ విషయంలో పొగడ్తల కంటే తెగడ్తలే వస్తాయని అంచనా వేసే దీన్ని రిలీజ్‌కు, ముందు తర్వాత పెద్దగా ప్రమోట్ చేయకుండా వదిలేసినట్లు కనిపిస్తోంది.