ఆదిపురుష్ ఈవెంట్.. వేరే లెవెల్

వేసవిలో భారీ చిత్రాలు లేక టాలీవుడ్ బాక్సాఫీస్ కళ తప్పిందనే చెప్పాలి. దీంతో ఈ సీజన్ తర్వాత రానున్న ప్రభాస్ భారీ చిత్రం ‘ఆదిపురుష్’ కోసం ఇటు ట్రేడ్ వర్గాలు, అటు ప్రేక్షకులతో పాటు మొత్తంగా ఇండస్ట్రీ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇంకో మూడు వారాల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ‘ఆదిపురుష్’ను రిలీజ్ చేయడానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి.

తెలుగులో ఈ సినిమాకు మంచి బజ్ ఉండగా.. దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే నెల 6న తిరుపతి వేదికగా ‘ఆదిపురుష్’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోతున్నట్లు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చింది. ఆ ఈవెంట్‌ను నభూతో అనే స్థాయిలో నిర్వహించడానికి ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

తిరుపతి మొత్తం రామ నామ స్మరణతో మార్మోగిపోయేలా ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారట. ఇందుకోసం ముంబయి నుంచి వంద మంది గాయకులు.. రెండొందల మంది డ్యాన్సర్లను రప్పిస్తున్నారట. వీళ్లంతా కలిసి రాముడి  మీద అద్భుత గీతాలను పెర్ఫామ్ చేయబోతున్నారట. వంద మంది కలిసి ఒకేసారి పాటలు పాడితే.. ఎలాంటి రీసౌండ్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈవెంట్‌కు లక్ష మందికి తక్కువ కాకుండా అభిమానులు వస్తారన్న అంచనాతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక వాళ్లంతా కూడా కలిసి రామ నామస్మరణ చేస్తే ఈవెంట్ హోరెత్తిపోవడం ఖాయం. టాప్ యాంకర్ సుమనే ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యానాన్ని అందించబోతోంది. ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ సహా యూనిట్లో కీలకమైన వ్యక్తులందరూ ఈ ఈవెంట్లో సందడి చేయనున్నారు. దేశమంతా చర్చించుకునేలా ఈ ఈవెంట్‌ను చేయడం కోసం కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది.