శ్రుతి హాసన్.. ఇంటర్నేషనల్ రేంజే

కమల్ హాసన్ తనయురాలు శ్రుతి హాసన్ తండ్రి లాగే బహుముఖ ప్రజ్నాశాలి. ఆమె కథానాయికగా అవతారం ఎత్తడానికి ముందే సంగీత దర్శకురాలిగా పని చేసిన విషయం చాలామందికి తెలియదు. కమల్ కథానాయకుడిగా నటించిన ‘ఈనాడు’ చిత్రానికి ఆమే మ్యూజిక్ కంపోజర్.

సంగీతం విషయంలో చిన్నప్పట్నుంచి మంచి అభిరుచి ఉన్న శ్రుతి టీనేజీలో సొంతంగా కొన్ని ఆల్బమ్స్ చేసింది. కథానాయికగా బిజీ అయ్యాక కూడా కొన్ని సినిమాల్లో పాటలు పాడింది. ‘3’, ‘శ్రీమంతుడు’ లాంటి సినిమాల్లో తన గళాన్ని ఆమె వినిపించింది. ఐతే తర్వాత హీరోయిన్‌గా బాగా బిజీ అయిపోవడంతో తన సంగీతాభిరుచిని పక్కన పెట్టేసింది.

కొన్నేళ్ల కిందట సినిమాల నుంచి ఉన్నట్లుండి విరామం తీసుకున్న శ్రుతి.. లండన్ వెళ్లి కొన్ని బ్యాండ్‌లతో కలిసి పాటలు రూపొందించడం, సంగీత ప్రదర్శనలు ఇవ్వడం తెలిసిన సంగతే. ఇప్పుడు మరోసారి తనలోని గాయనిని బయటికి తీసుకొచ్చింది. ‘ఎడ్జ్’ పేరుతో ఆమె ఇంగ్లిష్ పాట పాడింది. దానికి సంగీతం కూడా తనే సమకూర్చుకుంది. ఈ పాటను తాజాగా సోషల్ మీడియాలో లాంచ్ చేసింది.

ఆ పాటను శ్రుతి ఆలపించిన వైనం చూస్తే ఇంటర్నేషనల్ రేంజ్ పాప్ సింగర్లు గుర్తుకొస్తున్నారు. వాయిస్‌లో మాడ్యులేషన్‌తో వావ్ అనిపించేలా ఈ పాటను ఆలపించింది శ్రుతి. నాగచైతన్య సహా చాలామంది సెలబ్రెటీలు ఈ పాటను ప్రమోట్ చేస్తూ శ్రుతిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.