ఆరేళ్ల త‌ర్వాత సినిమా తీయ‌బోతున్న ఆ దర్శ‌కుడు


తెలుగు సినిమాకు జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో కూడా శూన్య హస్తమే మిగులుతున్న రోజులవి. అలాంటి సమయంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం పురస్కారమే కాదు.. ఏకంగా ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలోనూ జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన సినిమా ‘షో’. ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న‌ దర్శకుడు నీలకంఠ.

‘షో’ తర్వాత అతను చేసిన ‘మిస్సమ్మ’ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. క‌మ‌ర్షియ‌ల్‌గానూ మంచి విజ‌యాన్నందుకుంది. కానీ ఆ తర్వాత తనపై పెట్టుకున్న అంచనాల్ని నిలబెట్టలేకపోయాడు నీల‌కంఠ‌. చివరగా నీలకంఠ తీసిన ‘మాయ’ విమర్శకుల ప్రశంసలందుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. ఆ త‌ర్వాత క్వీన్ రీమేక్ బాధ్య‌త‌లు వ‌చ్చాయి కానీ.. ఏవో కార‌ణాల‌తో ఆ ప్రాజెక్టు నుంచి బ‌య‌టికొచ్చేశాడు నీల‌కంఠ‌.

మొత్తంగా చూస్తే నీల‌కంఠ సినిమా తీసి ఆరేళ్లు దాటిపోయింది. ఇక ఆయ‌న్ని అంద‌రూ మ‌రిచిపోయిన ఈ స‌మ‌యంలో మ‌ళ్లీ ఓ సినిమా చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ట‌. ఆయ‌న సినిమా తీయ‌బోయేది సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్‌తోన‌ట‌. వీళ్లిద్ద‌రూ క‌లిసి ఓ థ్రిల్ల‌ర్ సినిమా చేసే అవ‌కాశాలున్నాయ‌ట‌. క‌థా చ‌ర్చ‌లు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చాయ‌ని.. నిర్మాత‌ను సెట్ చేసుకుని త్వ‌ర‌లోనే సినిమాను అనౌన్స్ చేస్తార‌ని అంటున్నారు.

చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. రాజ‌శేఖ‌ర్ చివ‌రి సినిమా క‌ల్కికి ద‌ర్శ‌కుడైన ప్ర‌శాంత్ వ‌ర్మ‌నే.. నీల‌కంఠ మ‌ధ్య‌లో వ‌దిలేసిన క్వీన్ తెలుగు రీమేక్ ప‌ని పూర్తి చేశాడు. ఆ సంగ‌త‌లా ఉంచితే.. రాజ‌శేఖ‌ర్‌కు కూడా హిట్టు అవ‌స‌ర‌మైన స్థితిలో ఆయ‌న‌తో జ‌త క‌డుతున్న నీల‌కంఠ ఇద్ద‌రికీ మంచి చేసే సినిమా తీస్తాడేమో చూడాలి.