ఘాటెక్కిన ఘట్టమనేని ‘గుంటూరు కారం’

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు 28 టైటిల్ రివీల్ తో పాటు టీజర్ గురించి ఫ్యాన్స్ అంచనాలు మాములుగా లేవు. గుంటూరు కారం ఆల్రెడీ లీక్ అయ్యింది కాబట్టి దాని మీద ప్రత్యేక ఎగ్జైట్ మెంట్ లేదు కానీ తమ హీరో ఊర మాస్ అవతారం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టే మోసగాళ్లకు మోసగాడు ఫోర్ కె రీ రిలీజ్ తో ముడిపెట్టి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్లో బిగ్ స్క్రీన్ మీద లాంచ్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత మహేష్ ఒక స్పైసీ టైటిల్ తో వస్తున్నాడు. మాస్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.

ఇక వీడియో విషయానికి వస్తే మహేష్ మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూపించడానికి మాత్రమే ఈ టీజర్ ని వాడుకున్నారు. కథకు సంబంధించిన ఎలాంటి క్లూస్ లేదా ఇతర పాత్రల పరిచయాలు ఏమీ లేవు. ఆల్రెడీ వచ్చేసిన పోస్టర్ లోని గళ్ళ చొక్కా, ఎర్రని తుండుగుడ్డని నుదుటి మీద ధరించి హీరో గెటప్ ఓ రేంజ్ కిరాక్ అనిపించేలా సెట్ చేశారు. త్రీడిలో బీడీ కనపడుతుందా అనే డైలాగుతో పాటు ఇంకో ప్యాంట్ షర్ట్ లో స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చే వేరే షాట్, జీపు గాల్లో పేలిపోయే సీన్ పెట్టారు. ఓవరాల్ గా ఉన్న విజువల్  తక్కువగా ఉన్నా ట్యాగ్ లైన్ కు తగ్గట్టు మంటపెట్టేలా ఉంది

సినిమా రిలీజ్ కు ఇంకా ఏడు నెలల టైం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఈ కంటెంట్ సరిపోతుంది. షూటింగ్ కీలక భాగం ఇంకా జరగనే లేదు. ఉన్నంతలో త్రివిక్రమ్ ఏదో ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇస్తే సంతోష పడతారని దాన్నే ఇలా కట్ చేయించి తీసుకొచ్చాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సన్నకర్ర అనే చిన్న బిట్ సాంగ్ ఎప్పటిలాగే ఎలివేషన్ కు బాగా ఉపయోగపడింది. కథ సరిగ్గా పడాలే కానీ కమర్షియల్ స్టేచర్ ఉన్న వాళ్ళతో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ కొడతారో అల వైకుంఠపురములోతో నిరూపించిన త్రివిక్రమ్ ఈసారి గుంటూరు కారంలో డబుల్ దట్టించినట్టే ఉంది. అతడు, ఖలేజా తాలూకు బాకీ వడ్డీతో సహా ఇవ్వాలిగా మరి