టాక్ ఆఫ్ ద టౌన్: ప్రభాస్ పెద్ద మనసు

టాలీవుడ్లో ముఖానికి మాస్కులేసుకోకుండా మాట్లాడే, ప్రవర్తించే హీరోల్లో ప్రభాస్‌ పేరును ముందు వరుసలో చెప్పుకోవచ్చు. వ్యక్తిత్వ పరంగా ప్రభాస్ గోల్డ్ అని అంటారు అందరూ. తన చుట్టూ ఉన్న వాళ్లందరినీ చాలా బాగా చూసుకుంటాడని ప్రభాస్‌కు పేరుంది. ఎప్పట్నుంచో తనకు మిత్రులైన ప్రమోద్, వంశీలను ‘మిర్చి’ సినిమాతో నిర్మాతలుగా మార్చి ‘యువి క్రియేషన్స్’ను పెద్ద స్థాయికి తీసుకెళ్లాడు ప్రభాస్.

ఐతే ఒక దశ వరకు టాలీవుడ్లో యువి వాళ్ల ఆధిపత్యం నడిచింది. ఆ సంస్థను మరో స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ‘బాహుబలి’ తర్వాత వరుసగా రెండు సినిమాలు కమిటయ్యాడు ప్రభాస్. ఇది యువి వాళ్లకు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. కానీ ఈ అవకాశాలను యువి వాళ్లు ఉపయోగించుకోలేకపోయారు. పెరిగిన ప్రభాస్ రేంజికి తగ్గట్లు అయిన కాడికి ఖర్చు పెట్టి సాహో, రాధేశ్యామ్ చిత్రాలను నిర్మిస్తే.. అవి రెండూ నిరాశనే మిగిల్చాయి. దీంతో భారీ నష్టాలు తప్పలేదు.

కొత్తగా పెద్ద సినిమాలు నిర్మించడానికి డబ్బులు లేకపోగా.. అప్పుడు భారీ స్థాయిలో ఉండటంతో యువి వాళ్ల భవిష్యత్తే ప్రమాదకరంగా మారిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రభాసే.. తన మిత్రులను కష్టాల నుంచి గట్టెక్కించినట్లు తెలుస్తోంది. ‘ఆదిపురుష్’ తెలుగు రాష్ట్రాల హక్కులను చాలా ముందుగానే తక్కువ రేటుకు యువి వాళ్లకు ఇప్పించాడు ప్రభాస్. ఒక రకంగా చెప్పాలంటే ఈ హక్కులను ప్రభాస్ కోసమనే తక్కువకు ఇచ్చాడు నిర్మాత భూషణ్ కుమార్.

మొదట్లో పెట్టిన పెట్టుబడి రూ.80 కోట్లయితే.. ఇప్పుడు అంతకు రెట్టింపు కన్నా కాస్త ఎక్కువ రేటుకు మారు బేరానికి పీపుల్స్ మీడియా వాళ్లకు ఇచ్చారు. ఈ డీల్‌తో 80-90 కోట్ల మధ్య యువి వాళ్లకు లాభం చేకూరినట్లు సమాచారం. మరోవైపు ప్రభాస్ కొత్త చిత్రం ‘స్పిరిట్’లోనూ యువి వాళ్లు భాగస్వాములుగా ఉండగా.. ఆ డీల్‌ను కూడా పీపుల్స్ మీడియా వాళ్లకే మళ్లించారు. ఇలా భాగస్వామ్య హక్కులను ఇచ్చినందుకు కూడా యువి వాళ్లకు పీపుల్స్ మీడియా నుంచి భారీగానే ముట్టింది.

ఈ రెండు డీల్స్‌లోనూ ప్రభాసే కీలకం. అతనే మధ్యలో ఉండి యువి వాళ్లకు భారీగా ఆదాయం సమకూరేలా చేశాడు. దిల్ రాజుకు ఇవ్వాల్సిన రూ.40 కోట్లతో పాటు.. మొత్తం అప్పులన్నీ క్లియర్ చేసి.. ఇప్పుడు కొత్త సినిమాల కోసం పెద్ద ఫండ్ కూడా రెడీ చేసుకుని యువి వాళ్లు సేఫ్ జోన్లోకి వచ్చేశారు. ఇదంతా ప్రభాస్ వల్లే సాధ్యమైందంటూ.. అతడి మనసు బంగారం అంటూ ఇండస్ట్రీ జనాలు కొనియాడుతున్నారు