9 రోజుల ముందే ఫ్లాష్ ప్రీమియర్లు

వరల్డ్ వైడ్ రిలీజ్ పరంగా ఆదిపురుష్ కి విదేశాల్లో తీవ్రమైన పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న హాలీవుడ్ మూవీ ఫ్లాష్ కొత్త ట్విస్టు ఇచ్చింది. విడుదలకు తొమ్మిది రోజుల ముందే జూన్ 6న ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఫ్యాన్స్ ప్రీమియర్లు ప్లాన్ చేస్తోంది. దీని కోసం అభిమానులు చేయాల్సిందల్లా నిర్మాణ సంస్థ ఇచ్చిన మూడు క్వశ్చన్ల ప్రశ్నావళిని పూరించి ఉంటున్న నగరాన్ని ఎంచుకుని సబ్మిట్ కొట్టడమే. సరైన సమాధానాలు ఇచ్చినవాళ్లకు టికెట్లు ఎలా ఇవ్వాలనే సమాచారం తర్వాత ఈమెయిల్ లో పంపిస్తారు. వీటికి డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు.

హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలో ప్రస్తుతం ఈ షోలను కన్ఫర్మ్ చేశారు. మరికొన్ని తోడయ్యే అవకాశాలున్నాయి. ట్రైలర్ వచ్చాక ఫ్లాష్ మీద అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇందులో బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ క్యారెక్టర్లను పెట్టడంతో హైప్ మాములుగా లేదు. ఒకవేళ ఆరో తేదీన పాజిటివ్ టాక్ వస్తే మాత్రం యుఎస్ యూకే లాంటి దేశాల్లో ఆదిపురుష్ కి ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా తగినన్ని స్క్రీన్లు దొరక్కపోవచ్చు. ఫ్లాష్ త్రీడిలో వేల కోట్ల  బడ్జెట్ తో రూపొందింది. విజువల్స్ చూస్తేనే రేంజ్ ఏంటో అర్థమవుతుంది

చూస్తుంటే మన నిర్మాతల స్ట్రాటజీనే తెల్లోళ్ళు ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. కాకపోతే మరీ ఇంత త్వరగా ప్రీమియర్లు వెనుక మతలబు ఆదిపురుష్ ని తట్టుకోవడం కోసమేనా లేక మరో కారణం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. అందులోనూ ప్రపంచంలోనే  మొదటి షోలు మన దేశంలో వేయడం బట్టి చూస్తే ఏదో పెద్ద ప్లానే కనిపిస్తోంది. ఎంత ఆదిపురుష్ మన సినిమానే అయినా మల్టీప్లెక్సులు ఫ్లాష్ ని మరీ తక్కువ చేసి చూడవు. సరిపడా షోలు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తాయి. ఏదైతేనేం ఇంకో వారంలోపు ఫ్లాష్ సంగతి తేలిపోతుంది