దివంగత మహానాయకుడు ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన అన్న.. మెగాస్టార్ చిరంజీవి ఏకకాలంలో అన్నగారికి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక నందమూరి తారక రామారావు అని పవన్ కల్యాణ్ కొనియాడారు. చరిత్ర మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. శత జయంతి వేళ ఆయనకు అంజలి ఘటించిన పవన్ కల్యాణ్.. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికార కైవసం చేసుకున్నారని ప్రశంసించారు.
ఢిల్లీ రాజకీయాల్లో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి ‘ఆత్మ గౌరవం’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి అజేయమైన విజయం సాధించారన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలు ఎందరికో అనుసరణీయంగా మారాయని పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్.. తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు.
ఇక, చిరంజీవి ఏమన్నారంటే.. నూటికో కోటికో ఒక్కరు.. వందేళ్లు కాదు.. చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు నందమూరి తారక రామారావు”.. అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన నందమూరి తారక రామారావు గారితో అనుబంధం తనకెప్పుడూ చిరస్మరణీయం అని తెలిపారు. రామారావు శత జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. వచ్చె ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తులు ఖాయమని చర్చ జరుగుతున్న సమయంలో అన్నదమ్ములు ఇద్దరూ నివాళులర్పించడం.. ప్రాధాన్యం సంతరించుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates