ధనుష్ మైల్‌స్టోన్ మూవీలో తెలుగు హీరో

తమిళ నటుడు ధనుష్ బహుముఖ ప్రజ్ఞాశాలే. అతను ఎంత గొప్ప నటుడని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దీనికి తోడు అతను చక్కగా పాటలు పాడతాడు. ఆ పాటలు తనే రాసుకుంటాడు కూడా. ఇంకా రైటర్‌గా, డైరెక్టర్‌గా కూడా అతడి పనితనాన్ని ప్రేక్షకులు చూశారు. రైటర్ కమ్ డైరెక్టర్‌గా అతడి తొలి చిత్రం ‘పవర్ పాండి’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీని తర్వాత ‘రుద్ర’ పేరుతో ఒక భారీ సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. అందులో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలక పాత్ర పోషించాల్సింది.

కానీ బడ్జెట్, ఇతర సమస్యలతో ఆ సినిమా ఆగిపోయింది. కొన్నేళ్ల పాటు మళ్లీ దర్శకత్వ ఆలోచన చేయని ధనుష్.. ఇప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన కెరీర్లో మైలురాయి అనదగ్గ 50వ సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోన్నాడట ధనుష్.

‘రాయన్’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇందులో విష్ణు విశాల్, దుషార విజయన్, ఎస్.జే.సూర్య, కాళిదాస్ జయరాంలతో పాటు తెలుగు యువ కథానాయకుడు సందీప్ కిషన్ కూడా ఒక కీలక పాత్ర పోషించనున్నాడట. ధనుష్‌తో మంచి అనుబంధం ఉన్న సన్ పిక్చర్స్ పెద్ద బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. టైటిల్, కాస్టింగ్ కూడా ఖరారైందంటే ఈ ప్రాజెక్టు అతి త్వరలో పట్టాలెక్కబోతున్నట్లే.

తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత సరైన విజయం లేక అల్లాడుతున్న సందీప్‌కు.. తమిళంలో మంచి సినిమాలే పడ్డాయి. మాయవన్, మానగరం, కసాటా డబార లాంటి చిత్రాలు అతడికి మంచి పేరు తేవడంతో పాటు కమర్షియల్‌గానూ సక్సెస్ అయ్యాయి. చివరగా అతను నటించిన ద్విభాషా చిత్రం ‘మైఖేల్’ మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడు ధనుష్ మైల్‌స్టోన్ మూవీలో అవకాశం దక్కించుకున్న సందీప్.. ఇందులో తనదైన ముద్ర వేయడానికి గట్టి ప్రయత్నమే చేస్తాడనడంలో సందేహం లేదు.