బాబాయ్ అబ్బాయ్ ఫాన్స్ ఆలోచించాలి

ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు రావడం తారక్ బాలయ్య అభిమానుల మధ్య అర్థం లేని రచ్చకు దారి తీస్తోంది. కావాలని రాలేదని ఒక వర్గం పనిగట్టుకుని ప్రచారం చేసింది. దీంతో అసలేం జరిగిందని ప్రాక్టికల్ గా ఆలోచించే పరిణితి లేని కొందరి తొందపాటు వల్ల వ్యవహారం ట్విట్టర్ లో స్పేస్ లు పెట్టుకుని మరీ దూషించుకోవడం దాకా వెళ్లిపోయింది.

అదే రోజు జూనియర్ పుట్టినరోజు కావడం కాకతాళీయమే అయినా దాన్ని విస్మరిస్తున్నారు. బాలయ్య తారక్ పదే పదే కలుసుకునే సందర్భాలు రాకపోయినా దశాబ్దాల తరబడి దూరంగా లేరన్నది కూడా వాస్తవం. అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి కారణం త్రివిక్రమ్ కాదుగా, ఎన్టీఆర్ బయోపిక్ వేడుకకు అన్నయ్య కళ్యాణ్ రామ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ రావడం స్పీచ్ ఇవ్వడం ఇప్పటికీ వీడియోల్లో చూసుకోవచ్చు.

తాతయ్య పాత్రలో బాబాయ్ నటించాడనే ఆనందమేగా వ్యక్తం చేసింది. ఇంకా వెనక్కు వెళ్తే ఒకే స్టేజి మీద దండలు పంచుకోవడం, బాలయ్యకు అబ్బాయి పాదాభివందనం చేయడం ఇవన్నీ సాక్షాలుగా ఉన్నాయి. ఇదంతా ఆలోచించకుండా దుమ్మెత్తి పోసుకోవడం వల్ల మధ్యలో యాంటీ ఫ్యాన్స్ ఆనందించడం తప్ప ఇంకేమి ఒరగదు. ఆల్రెడీ ఇదే జరుగుతోంది.

ఏ స్టార్ కుటుంబమైనా సరే ప్రతిసారి కలయికలు ఆశించలేం. ఆ మాటకొస్తే చిరంజీవి పవన్ లు కలిసి నెలలు దాటిపోతోంది. బన్నీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కొన్ని నెలల క్రితమే నానా రచ్చ చేసుకున్నారు. ఓజి ట్యాగ్ కోసం మెగాభిమానుల మధ్య ఒకటే రగడ. ఇవన్నీ అర్థం లేని వ్యవహారాలు. సదరు కుటుంబాల్లో అంతా బాగున్నప్పుడు ఫ్యాన్స్ ఇలా లేనిపోనివి ఊహించుకుని ఇలా రచ్చకెక్కితే సదరు హీరోలు కూడా సంబరపడరు ఈ అపరిపక్వతకు బాధ పడటం తప్ప.