వ్యసనం ఏదైనా ఒక్కసారి అలవాటు పడ్డాక దాన్నుంచి బయటపడలేని బలహీనత అందరికీ ఉండేదే. దానికి సూపర్ స్టార్లు సైతం మినహాయింపు కాదు. శరత్ బాబు కాలం చేశాక ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్న రజని విపరీతమైన ధూమపానం గురించిన సంఘటన ఒకటి వివరించారు. ఓసారి షూటింగ్ లో ఇద్దరూ కలిసి ఒక సీన్ చేస్తున్నారు. రజనీకాంత్ చెబుతున్న డైలాగ్ ఎంతకీ ఓకే కావడం లేదు. అప్పటికీ 15 టేకుల దాకా తీసుకున్నారు. సాధారణంగా అంత స్టేచర్ ఉన్న హీరో ఇన్నేసి అడగడం అరుదు. అలా జరగడానికి కారణం శరత్ బాబు.
తన స్నేహితుడిగా మాట ఇచ్చిన కారణంగా శరత్ బాబు ముందు సిగరెట్లు కాల్చేవారు కాదు రజని. దాని వల్లే స్పాట్ లో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించిన శరత్ స్వయంగా ఒకటి తెప్పించి మరీ కాల్చమని చెప్పారట. ఆ తర్వాతే షాట్ ఓకే అయ్యింది. దీన్ని బట్టే ఇద్దరి మధ్య పరస్పరం ఎంత స్నేహం గౌరవం ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ బాండింగ్ గొప్పగా పండిన సినిమాల్లో మొదటిది అన్నామలై. తెలుగులో బిర్లా రాముడిగా డబ్బింగ్ చేశారు. తమిళంలో భారీ బ్లాక్ బస్టర్. టాలీవుడ్ రీమేక్ లో వెంకటేష్ సుమన్ లు ఈ పాత్రలు చేశారు కానీ ఒరిజినలే బాగుంటుంది.
ఆ తర్వాత ఒకే అమ్మాయిని ప్రేమించిన జమిందార్, నౌకర్లుగా రజని శరత్ బాబుల ఫ్రెండ్ షిప్ ముత్తులో గొప్పగా పండింది. ఇలా ఒకటి రెండు కాదు శరత్ బాబుకు మన స్టార్ల దగ్గర కూడా ఎన్నో గొప్ప అనుభూతులున్నాయి. ఇటీవలే ఆసుపత్రిలో చేరినప్పుడు ఈయన పరిస్థితి చూసి చిరంజీవి కళ్లనీళ్లు పెట్టుకున్నారని సుహాసిని స్వయంగా చెప్పారు. ఇవన్నీ బయట ప్రపంచానికి తెలియనివి. నరేష్ పవిత్ర లోకేష్ ల మళ్ళీ పెళ్లిలో సూపర్ స్టార్ కృష్ణగా శరత్ బాబు చివరి పాత్ర వేయడం విధి లిఖితం. ఇందులో ఆయనకు భార్యగా గతంలో ఎన్నోసార్లు జంటగా నటించిన జయసుధ నటించడం కాకతాళీయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates