అఫీషియల్: తొలిసారి పవన్‌కు ఆయన మ్యూజిక్

పవన్ కళ్యాణ్ సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా… దాదాపు అన్నీ మ్యూజికల్ హిట్స్‌గానే నిలిచాయి. అయితే తనకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్‌ను మళ్లీ మళ్లీ రిపీట్ చేయడం పవన్ కళ్యాణ్‌కు అలవాటు. అందుకే ఆయన సినిమాకు సంగీతం అందించే అవకాశం చాలామంది సంగీత దర్శకులకు దక్కలేదు. ఆ జాబితాలో ఓ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు.

అయితే ఎట్టకేలకు పవన్‌ సినిమా ఛాన్స్ ఆ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్‌కు దక్కింది. ఆయనే తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాలకు సంగీతం అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్. కీరవాణి.

ముప్పై ఏళ్లుగా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్న కీరవాణి… ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతాన్ని అందించారు. ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా నుంచి ‘అన్నమయ్య’, ‘బాహుబలి’ దాకా ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలు కీరవాణి సంగీత సారథ్యంలో రూపొంది, ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

చారిత్రక, పౌరాణిక, జానపద చిత్రాలకు కీరవాణి అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలాన్ని చేకూర్చాయి. అంతెందుకు ఇండియన్ బాక్సాఫీస్ వండర్ ‘బాహుబలి’ సినిమా సక్సెస్‌లో స్వరకర్త కీరవాణికి భాగం ఇవ్వాల్సిందే. అందుకే క్రిష్, పవన్ కళ్యాణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు ఏరికోరి కీరవాణిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారట.

ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు కీరవాణి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్, క్రిష్ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నట్టు కన్ఫార్మ్ చేశారు కీరవాణి. సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్న కీరవాణి, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పవన్ కల్యాణ్ నుంచి అగ్రిమెంట్ కూడా అందుకున్నారట. 18వ శతాబ్దానికి చెందిన ఓ చారిత్రక నేపథ్య కథతో రూపొందుతున్న ఈ సినిమాలో జాక్వెలిస్ ఫెర్నాండేజ్ వంటి బాలీవుడ్ నటీనటులు కూడా నటించబోతున్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నాలుగైదు భాషల్లో ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మించాలని భావిస్తున్న నిర్మాత ఏఎమ్ రత్నం, అందుకు తగ్గట్టుగా సాంకేతిక నిపుణులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘పింక్’ రీమేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా తర్వాత క్రిష్ సినిమాను ప్రారంభిస్తారు.