డివైడ్ టాక్‌తో హిట్.. ఇంకో సీక్వెల్‌కు రెడీ

ఏడేళ్ల కిందట టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ‘బిచ్చగాడు’. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి ఇంత కాలానికి సీక్వెల్ చేశాడు విజయ్ ఆంటోనీ. ‘బిచ్చగాడు’ను శశి డైరెక్ట్ చేస్తే.. ‘బిచ్చగాడు-2’ను స్వయంగా విజయ్ ఆంటోనీనే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాడు.

గత శుక్రవారమే తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఏమంత మంచి టాక్ రాలేదు. ‘బిచ్చగాడు’కు దరిదాపుల్లో కూడా లేదనే విమర్శలు వచ్చాయి. అయినా సరే.. టాక్‌తో సంబంధం లేకుండా ఈ చిత్రం రెండు భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. తెలుగులో మాత్రమే ఇప్పటిదాకా పది కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. తమిళంలో కూడా మంచి ఓపెనింగ్సే వచ్చాయి.

ఈ ఉత్సాహంలో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ ఫ్రాంఛైజీలో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ‘బిచ్చగాడు-3’ కచ్చితంగా ఉంటుందని.. 2025లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని తెలిపాడు. ‘బిచ్చగాడు-2’ మాదిరే ఈ చిత్రం కూడా ఒక కొత్త కథతో తెరకెక్కుతుందని.. తొలి రెండు సినిమాలతో దీనికి సంబంధం ఉండదని విజయ్ స్పష్టం చేశాడు.

బిచ్చగాడు-3ని కూడా తనే డైరెక్ట్ చేసే అవకాశాలున్నట్లు విజయ్ సంకేతాలు ఇచ్చాడు. ‘బిచ్చగాడు-2’ను ముందు వేరే దర్శకుడితో మొదలుపెట్టిన విజయ్.. తర్వాత తనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా అతనే. సినిమా మంచి లాభాలు అందిస్తుండటం, ‘బిచ్చగాడు’ బ్రాండ్ ఎంత స్ట్రాంగో బాక్సాఫీస్ దగ్గర మరోసారి రుజువు కావడంతో మరో ఆలోచన లేకుండా ఈ ఫ్రాంఛైజీలో కొత్త సినిమాను ప్రకటించేశాడు విజయ్.