విలక్షణ నటులు శరత్ బాబు ఇక లేరు

విలక్షణ నటుడిగా పేరున్న శరత్ కుమార్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో పోరాడుతూ చికిత్స తీసుకుంటున్న తరుణంలో ఇవాళ హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో కన్ను మూశారు. వయసు 71. స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస. అసలు పేరు సత్యంబాబు దీక్షిత్. తల్లితండ్రులు విజయశంకర దీక్షితులు, సుశీలాదేవి. కాలేజీ రోజుల్లో నాటకాలు వేయడంతో మొదలుపెట్టి యాక్టింగ్ మీద విపరీతమైన ఆసక్తి చూపించిన శరత్ బాబు 1973 రామరాజ్యంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ సమయంలోనే హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. దర్శకులు సింగీతం మంచి బ్రేక్ ఇచ్చారు

రెండు వందల యాభైకి పైగా సినిమాల్లో ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. అన్వేషణలో కోల్డ్ బ్లడెడ్ కిల్లర్ గా, అభినందనలో భార్యను పోగొట్టుకున్న ఒంటరివాడిగా, సాగర సంగమంలో కమల్ హాసన్ స్నేహితుడిగా, సితారలో అన్నయ్యగా మర్చిపోలేని క్యారెక్టర్లతో అశేషమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. గుప్పెడు మనసు చాలా ఫేమ్ తీసుకొచ్చింది. స్వాతిముత్యం, సంసారం ఒక చదరంగం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. రమాప్రభతో వైవాహిక జీవితం – విడాకులు అప్పట్లో సంచలనం రేపింది. తర్వాత స్నేహ నంబియార్ ని వివాహమాడారు. సీతాకోకచిలుక-నీరాజనం-ఓ భార్య కథ ద్వారా మూడుసార్లు నంది అవార్డు అందుకున్నారు

టీవీ సీరియల్స్ లోనూ శరత్ బాబు తనదైన ముద్ర వేశారు. ఈటీవీ ఛానల్ లో వచ్చే అంతరంగాలు చాలా పాపులారిటీ తీసుకొచ్చింది. వయసు మళ్ళాక నటించడం తగ్గించినప్పటికీ నచ్చే పాత వస్తే ఎప్పుడూ నో చెప్పలేదు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో కనిపించారు. ఈ శుక్రవారం రిలీజ్ కాబోయే మళ్ళీ పెళ్లిలో కృష్ణ గారిలా చేశారు. ఇదే ఆయన చివరి తెలుగు సినిమా. ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకున్న శరత్ కుమార్ ఇక్కడే కాదు తమిళం మలయాళం కన్నడలోనూ బ్లాక్ బస్టర్స్ లో భాగమయ్యారు. సౌత్ ఇండస్ట్రీ స్టార్లు అందరితోనూ నటించిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది