అల్లరి నరేష్ అందించిన నవ్వులకు కామెడీ ప్రియులు అతడికి ఎంతగానో రుణపడి ఉండాలి. ‘అల్లరి’తో మొదలుపెట్టి.. ‘సుడిగాడు’ వరకు అతను మామూలుగా నవ్వించలేదు తెలుగు ప్రేక్షకుల్ని. అతడి సినిమాలు ఫ్లాప్ అయినా.. తన వరకు చక్కగా నవ్వించి పంపేవాడు. ఒకప్పుడు అతడి సినిమాలకు నష్టం అనేదే ఉండేది కాదు. తక్కువ బడ్జెట్లో తెరకెక్కడం వల్ల ఫ్లాప్ సినిమాలకు కూడా పెట్టుబడి వెనక్కి వచ్చేసేది.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడూ సేఫ్ జోన్లో ఉండేవాళ్లు. అందుకే అప్పట్లో అతను బిజీయెస్ట్ యాక్టర్లలో ఒకడిగా ఉండేవాడు. కానీ తర్వాత అతడి వైభవానికి తెరపడింది. వరుస ఫ్లాపులు అల్లరోడి మార్కెట్‌ను దెబ్బ తీశాయి. మంచి నటుడైన నరేష్ సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సిన రోజులొచ్చాయి. అతను చివరగా నటించిన ‘బంగారు బుల్లోడు’ విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ‘నాంది’ పేరుతో ఓ కొత్త తరహా సినిమా ఏదో చేస్తున్నాడు.
‘నాంది’ సినిమా తాను ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నింటికీ భిన్నంగా ఉంటుందని.. ఇది నరేష్ 2.0ను ఆవిష్కరించే సినిమా అని చెప్పాడు నరేష్. కచ్చితంగా తాను ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతానని అతను ధీమా వ్యక్తం చేశాడు. లాక్ డౌన్ లేకుంటే ఈ సినిమా ఈపాటికి పూర్తయ్యేదన్నాడు. ఇక తన కెరీర్లో ఎక్కువగా కామెడీ క్యారెక్టర్లే చేయడం వల్ల, సీనియర్ కావడం వల్ల తనకు ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్లు ఎవరూ ఆఫర్ చేయట్లేదని.. కానీ తాను నెగెటివ్ క్యారెక్టర్లు చేయడానికి కూడా సిద్ధమని నరేష్ ప్రకటించాడు.
తనను ఎలా అయినా వాడుకోవచ్చని.. వెబ్ సిరీస్‌లు చేయడానికి కూడా సిద్ధమని కూడా అతను వెల్లడించాడు. ‘మహర్షి’ సినిమాలో చేసిన ప్రత్యేక పాత్ర తనకెంతో సంతృప్తినందించిందని.. ఆ సినిమాకు ఊహించని స్థాయిలో ప్రశంసలు వచ్చాయని నరేష్ తెలిపాడు. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా మహేష్ ఎప్పుడూ తనను ‘సర్’ అనే సంబోధించేవాడని.. అప్పుడు తనకు అదోలా అనిపించేదని నరేష్ ఓ ఇంటర్వూలో అన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates