స్వంతంగా నిర్మించి మరీ రావణాసుర రూపంలో షాక్ తిన్న రవితేజకు ధమాకా, వాల్తేరు వీరయ్య ఇచ్చిన కిక్కు కొంత తగ్గిపోయింది. అందుకే తన ఆశలన్నీ టైగర్ నాగేశ్వరరావు మీద పెట్టుకున్నాడు. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామా అక్టోబర్ 20న విజయదశమి కానుకగా విడుదల కానుంది. అదే సమయంలో బాలకృష్ణ, విజయ్ ల సినిమాలు ఉన్నప్పటికీ మాస్ మహారాజా పోటీకి సై అంటున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ని నిర్మాతలు ప్లాన్ చేసిన విధానం ఆశ్చర్యపరుస్తోంది.
అయిదు బాషల నుంచి అయిదుగురు స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించి 24న రాజమండ్రిలో ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి మరీ లాంచ్ చేయబోతున్నారు. అంటే ఇదొక చిన్నపాటి టీజర్ లా ఉంటుందన్న మాట. తెలుగులో వెంకటేష్, కన్నడలో శివ రాజ్ కుమార్, హిందీలో జాన్ అబ్రహం. తమిళంలో కార్తీ, మలయాళంలో దుల్కర్ సల్మాన్ లు రవితేజ కోసం గొంతు కలిపేందుకు ఎస్ చెప్పి ఆ పని పూర్తి చేశారు. ఒక్కొక్కరిని ప్రత్యేకంగా స్టూడియోకు తీసుకెళ్లడం దగ్గరి నుంచి రికార్డింగ్ పూర్తి చేయించే దాకా అంతా వీడియో రూపంలో షూట్ చేయించి ఫ్యాన్స్ కి అప్డేట్ ఇచ్చారు.
ఇంత సెటప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ పబ్లిసిటీ స్పీడ్ ని ఇంకా పెంచబోతున్నారు. దశాబ్దాల క్రితం స్టువర్ట్ పురం ప్రాంతంలో పేరుమోసిన గజదొంగగా పోలీస్ స్టేషన్ రికార్డుల్లో ఉన్న నాగేశ్వరరావు అనే వ్యక్తి కథ ఇది. ఆషామాషీ చోరీ చేసే వ్యక్తి కాదితను. గూస్ బంప్స్ ఇచ్చే ఎన్నో ఘట్టాల్లో భాగమయ్యాడు. అందుకే ఈ కథను ప్రెజెంట్ చేయబోతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ జానర్ కి భిన్నంగా ఈ టైగర్ కథ ఉండబోతోంది. రైలు దోపిడీలు, దొరగారి ఇళ్లలో చోరీలు, లూటీలు ఇలా ఎన్నో చేసిన ఇతను హీరో ఎందుకు అయ్యాడనేదే ఈ కల్పితాన్ని జోడించిన బయోపిక్ లో చూపించబోతున్నారు.