బాలీవుడ్‌కు వెళ్తే రేప్ చేస్తారని భయపెట్టారు

తెరపై ఎప్పుడూ సంచలన పాత్రలు చేస్తుంటుంది రాధికా ఆప్టే. అలాగే బయట ఆమె ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. తెలుగులో ఓ అగ్ర కథానాయకుడి వల్ల తాను షూటింగ్ స్పాట్లో ఇబ్బంది పడ్డానంటూ ఆమె ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం రేపాయో తెలిసిందే. తెలుగులో ఆమె ఏ సినిమాల్లో నటించిందనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆ హీరో ఎవరనే విషయంలో కూడా అందరికీ ఒక క్లారిటీ ఉంది.

ఐతే బాలీవుడ్లో కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి చాలామంది ఆరోపణలు చేశారు. కానీ రాధికా మాత్రం ఆ పరిశ్రమను అంత చెడుగా చూడాల్సిన అవసరం లేనట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటం విశేషం.

బాలీవుడ్‌కు వెళ్తే అక్కడి వాళ్లు తనను రేప్ చేస్తారంటూ రాధిక వెల్లడించడం గమనార్హం. తన స్వస్థలం పుణె అని.. అక్కడి నుంచి సినిమా అవకాశాల కోసం ముంబయికి వెళ్లాలనుకున్నానని.. ఐతే ఆ సమయంలో కొందరు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పింది రాధికా. అక్కడికి వెళ్తే తనపై అత్యాచారాలు జరుగుతాయని.. బాలీవుడ్లో ఎప్పుడూ ఇలాగే జరుగుతుందని తనను భయపెట్టే ప్రయత్నం చేశారని ఆమె అంది.

సినీ పరిశ్రమ గురించి జనాలకు సదభిప్రాయం లేదన్న రాధిక.. మనం బాలీవుడ్లో జరిగే అతి గురించి మాట్లాడుకోవడంలోనే సమస్య ఉందని అభిప్రాయపడింది. బయట కూడా ఈ సమస్య ఉందని.. మనమంతా మనుషులమే అని.. అందరివీ సాధారణ జీవితాలే అని అర్థం చేసుకోవాలని పేర్కొంది రాధిక. మొత్తానికి చెడు అన్ని చోట్లా ఉందని.. కేవలం బాలీవుడ్‌ను మాత్రమే నిందించడం సరికాదన్నది రాధిక అభిప్రాయమన్నమాట.