నందమూరి వారిని మెగా ఫ్యామిలీ వ్యక్తులు పొగిడినా.. మెగా వారిని నందమూరి కుటుంబ సభ్యులు కొనియాడినా అందరూ ప్రత్యేక ఆసక్తితో గమనిస్తారు. సినిమాల పరంగా ఈ రెండు కుటుంబాల దశాబ్దాలుగా ఉన్న పోరు అలాంటిది మరి. హీరోలు స్నేహంగానే ఉన్నప్పటికీ.. అభిమానుల మధ్య విపరీతమైన పోటీ, ద్వేష భావం ఉండటం వల్ల హీరోలు ఒకరి గురించి ఒకరు సానుకూలంగా మాట్లాడినపుడు ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటించి.. వ్యక్తిగతంగా ఎంతో స్నేహంగా మెలిగినా అభిమానుల్లో మాత్రం ఆ వైరం కాస్త కూడా తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రామ్ చరణ్ చేసిన ప్రసంగం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఏమాత్రం శషబిషలు లేకుండా.. సీనియర్ ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ.. ఆయనకు తిరుగులేని ఎలివేషన్ ఇచ్చాడు రామ్ చరణ్.
ఇప్పుడు అందరూ సౌత్ ఇండియా సినిమా వెలుగుల గురించి.. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడం గురించి మాట్లాడుతున్నారని.. కానీ దశాబ్దాల కిందటే తెలుగు వాళ్లు, తెలుగు సినిమాల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్‌కే చెందుతుందని రామ్ చరణ్ అన్నాడు. తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం ఎన్టీఆర్ అనే పేరు చిరస్థాయిగా ఉంటుందని చరణ్ అభిప్రాయపడ్డాడు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే స్థాయి తనకు లేదని.. ఐతే ఆయన గురించి మాట్లాడ్డం కంటే.. అలాంటి వ్యక్తుల గురించి ఎప్పుడూ తలుచుకుంటూ ఉండటమే ముఖ్యం అని.. ఇలాంటి వేడుకలు ఎప్పడూ జరుగుతూ ఉండాలని చరణ్ అన్నాడు.
ఇప్పటికీ తెలుగులో సినిమాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ పేరును తలుచుకుంటూనే ఉంటారని.. ఆయన ఉన్న ఇండస్ట్రీలో తాను కూడా భాగం అయినందుకు ఎంతో గర్విస్తున్నానని చరణ్ అన్నాడు. పురంధరేశ్వరి కొడుకుతో కలిసి ఒకసారి ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఉదయం ఆరు గంటలకే ఆయన ఇంటికి వెళ్లడం.. చికెన్‌తో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఆయన.. తనకు కూడా టిఫిన్ పెట్టించడం మరిచిపోలేని అనుభవమని చరణ్ గుర్తు చేసుకున్నాడు. తన ప్రసంగం అంతా అయ్యాక ఈ వేడుకను నిర్వహించిన ‘మా చంద్రబాబు నాయుడు’ గారికి.. తనను ఆహ్వానించిన ‘మన బాలయ్య’ గారికి అని చరణ్ సంబోధించడం అందరినీ ఆకట్టుకుంది.