అభిమానులు ఒప్పుకుంటారా తలైవా?


ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు రజినీకాంత్. సూపర్ స్టార్ అనే ట్యాగ్‌కు ఆయన వంద శాతం అర్హుడు అని ఎవ్వరైనా ఒప్పుకుంటారు. గత కొన్నేళ్లలో సరైన సినిమాలు చేయక ఆయన క్రేజ్, ఫాలోయింగ్, మార్కెట్ దెబ్బ తిన్నాయి కానీ.. అంతకుముందు దశాబ్దాల పాటు ఆయన ఆధిపత్యం చలాయించారు. ఒక దశలో బాలీవుడ్ స్టార్లను కూడా వెనక్కి నెట్టి ఇండియాలోనే అతి పెద్ద స్టార్‌గా కొనసాగారు.
వయసులో ఉన్నపుడు రజినీ విరామం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేశారు కానీ.. వయసు మీద పడి, అనారోగ్య సమస్యలు కూడా తోడవడం.. అలాగే ఆయన సినిమాల మేకింగ్ టైం కూడా బాగా పెరిగిపోవడం వల్ల ఫ్రీక్వెన్సీ బాగా తగ్గిపోయింది. ఒక దశలో రాజకీయాల్లోకి వెళ్లడం కోసం సినిమాలు పూర్తిగా మానేద్దామని కూడా అనుకున్నారు రజినీ. ‘అన్నాత్తే’నే ఆయన చివరి సినిమా అవుతుందని కూడా ప్రచారం జరిగింది. కానీ తన వయసు, ఆరోగ్య సమస్యల దృష్ట్యా రాజకీయాలు వద్దని నిర్ణయించుకుని సినిమాలకే అంకితం అయ్యారు.

ఇలా ఫిక్సయ్యాక స్పీడు పెంచి చకచకా సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నారు. ‘జైలర్’తో పాటు ప్రత్యేక పాత్రలో ‘లాల్ సలామ్’ అనే సినిమా కూడా చేస్తున్న రజినీ.. కొత్తగా రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇంతలోనే రజినీ చివరి సినిమా అంటూ కలకలం రేపే వార్త ఒకటి బయటికి వచ్చింది. ‘విక్రమ్’ సినిమాతో ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా మారిన లోకేష్ కనకరాజ్ తన తర్వాతి సినిమాను రజినీతో చేయబోతున్నట్లు సీనియర్ దర్శకుడు మిస్కిన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతే కాక రజినీకిది చివరి సినిమా కావొచ్చని కూడా సంకేతాలు ఇచ్చాడు. ఓ పక్క అభిమానులు లోకేష్‌తో రజినీ సినిమా అనగానే ఎంతో ఎగ్జైట్ అవుతూనే.. మరోపక్క ఇది తలైవా చివరి సినిమా అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎలాగూ రాజకీయాలు వద్దనుకున్నారు. అనారోగ్య సమస్యలను జయించినట్లే కనిపిస్తూ హుషారుగా ఉన్నారు. అలాంటపుడు సినిమాల నుంచి సెలవు తీసుకోవడం ఎందుకు.. ఇప్పట్లా చకచకా సినిమాలు చేయకపోయినా పర్వాలేదు.. కానీ సినిమాలు మానేయొద్దన్నది వారి ఆకాంక్ష. పనిగట్టుకుని ఇదే చివరి సినిమా అని చెప్పి తప్పుకోవాల్సిన అవసరం లేదని.. నెమ్మదిగా సినిమాలు తగ్గిస్తూ వెళ్లి ముందు తరం లెజెండరీ నటుల మాదిరే క్రమ క్రమంగా సినిమాలకు దూరం కావాలే తప్ప.. రజినీ లాస్ట్ ఫిలిం అనే చర్చే వద్దని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.