బాబాని గుర్తు చేస్తున్న రజనీ మాటలు

సూపర్ స్టార్ రజనీకాంత్ తన చివరి సినిమాను ఫిక్స్ చేసుకున్నారన్న వార్త అభిమానుల్లో కలకలం రేపుతోంది. లోకేష్ కనగరాజ్ తో చేయబోయే ప్యాన్ ఇండియా మూవీతో నటనకు స్వస్తి చెబుతారని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నటుడు దర్శకుడు మిస్కిన్ అన్న మాటలు హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి తలైవా స్వయంగా ఇదేమీ చెప్పలేదు. కానీ పేరున్న డైరెక్టర్ అనడం వల్ల ఈ కామెంట్స్ కి రెక్కలొచ్చాయి. ప్రస్తుతం రజని వయసు 72. పలుమార్లు అనారోగ్యానికి  గురై అమెరికాలో సర్జరీలు చేయించుకున్నారు. 2.0 షూటింగ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డారు

ఇంత జరిగినా యాక్టింగ్ మాత్రం ఆపలేదు. కానీ ఈ మధ్య శరీరం ఎంత సహకరిస్తున్నా రాబోయే కొన్నేళ్లలో వచ్చే సమస్యలను వైద్యులు తీవ్రంగా హెచ్చరించడంతో రిటైర్ మెంట్ గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారని చెన్నై టాక్. ఒకవేళ ఓటిటి లాంటి షోలు ఏమైనా చేసుకునే ఛాన్స్ ఉంటే తప్ప సినిమా కెమెరా ముందుకు రాకూడదనే నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ మీడియా కథనం. అయితే రజని ఇలా డిసైడ్ కావడం ఇది మొదటిసారి కాదు. ఎప్పుడో 2002 బాబా టైంలోనే ఇది ఆఖరి చిత్రమని ప్రకటించడం ఫ్యాన్స్ మర్చిపోలేదు. తర్వాత ఏం జరిగిందో తెలిసిందే.

ప్రస్తుతం రజని జైలర్, లాల్ సలాంలతో బిజీగా ఉన్నారు. ఈ రెండూ ఇంకో రెండు మూడు నెలల్లో రిలీజవుతాయి. ఆ తర్వాత జై భీం ఫేమ్ టిజె జ్ఞానవేల్ ప్రాజెక్ట్ మొదలుపెడతారు. ఈలోగా లోకేష్ కనగరాజ్ ఫ్రీ అవుతాడు. స్క్రిప్ట్ పూర్తి చేసే లోపు అటు రజని వచ్చేస్తారు. సో కాంబో తేలిగ్గా సెట్ అవుతుంది. అయినా విరమణ అని చెప్పడమే కానీ లెజెండరీ స్టార్లు ఎక్కువ కాలం ఖాళీగా ఉండలేరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, చిరంజీవి, పవన్ అందరూ ఇలా చెప్పి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినవాళ్లే. మరి రజని దీనికి మినహాయింపుగా ఉంటారా లేక సెలవని విశ్రాంతి కోరుకుంటారా చూడాలి