డిజాస్టర్ స్ట్రీక్ ఆగేనా?

శుక్రవారం వస్తుంటుంది. పోతుంటుంది. అలాగే సినిమాలు వస్తుంటాయి. పోతుంటాయి. నిలబడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమాలు తక్కువగానే ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని వారాల పాటు.. నెలల పాటు కూడా డిజాస్టర్ స్ట్రీక్ కొనసాగుతుంది. అయినా సరే.. మళ్లీ శుక్రవారం రాగానే కొత్త సినిమా మీద ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకుంటారు సినీ జనాలు, ప్రేక్షకులు. ఈ వేసవిలో దసరా, విరూపాక్ష మినహా ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

‘విరూపాక్ష’ వచ్చి నాలుగు వారాలు కాగా.. మధ్యలో మూడు వారాలూ నిరాశ తప్పలేదు. గత వారం రిలీజైన ‘కస్టడీ’ కనీస ప్రభావం కూడా చూపకుండానే థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. ఇక ఈ వారం ఒక సినిమా చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో మళ్లీ ఆశలు రేగుతున్నాయి. అదే.. అన్నీ మంచి శకునములే.

అలా మొదలైంది, కళ్యాణ ప్రాప్తిరస్తు, ఓ బేబీ లాంటి మంచి సినిమాలు తీసిన నందిని రెడ్డి రూపొందించిన కొత్త సినిమా చక్కటి టీజర్, ట్రైలర్.. పాటలతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఒక పాజిటివ్ ఫీల్ తీసుకొచ్చిన ఈ సినిమాకు కాస్ట్ అండ్ క్రూ పెద్ద అసెట్ లాగా కనిపిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడబోతున్న భావన కలుగుతోంది. సమ్మర్లో ఒక రకంగా చెప్పాలంటే ఇది చివరి ఆశలాగా ఉంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు తీసుకొస్తుందని భావిస్తున్నారు.

కానీ టాక్ కీలకం. అది బాగుంటే సినిమా పెద్ద రేంజికి వెళ్లొచ్చు. దీంతో పాటుగా తమిళ అనువాద చిత్రం ‘బిచ్చగాడు-2’ కూడా రిలీజవుతోంది. బిచ్చగాడు అప్పట్లో ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. కాకపోతే తర్వాత విజయ్ ఆంటోనీ చెత్త సినిమాలు చేసి క్రేజ్ అంతా పోగొట్టుకున్నాడు. పైగా బిచ్చగాడు-2ను తనే డైరెక్ట్ చేయడం కూడా అంచనాలను తగ్గించేదే. మరి ఈ సినిమా ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి.