కరోనా వైరస్ విజృంభణతో అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోతే… ప్రభాస్ ‘రాధేశ్యామ్’ మాత్రం అన్నిటికంటే ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొంది. ఎందుకంటే ఈ చిత్ర నిర్మాణం అంతా యూరప్‌లోనే జరగాల్సి వుంది. లాక్డౌన్ నాటికి యూరప్‌లో కరోనా వీర విజృంభణ చేస్తోంది. దాంతో ఇప్పట్లో విదేశీయులను యూరప్‌లో అడుగుపెట్టనివ్వరనే ప్రచారం జరిగింది. దాంతో ఈ చిత్రం షూటింగ్ ఎలా చేయాలా అంటూ నిర్మాతలు తలలు పట్టుకున్నారు.
ఇక్కడే సెట్స్ వేసి వీలయినంత షూటింగ్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇండియాలో సిట్యువేషన్ మరీ దారుణంగా వుంటే, యూరప్ పొజిషన్ బెటర్ అయింది. కనుక రాధేశ్యామ్ బృందం అక్కడ షూటింగ్ చేయడం కోసం పర్మిషన్స్ గట్రా తెచ్చుకునే పనిలో వుంది. అన్నీ ఓకే అయిపోతే సెప్టెంబర్‌లో అక్కడకు తక్కువ మంది బృందంతో వెళ్లి షూటింగ్ మొదలు పెట్టాలని రాధేశామ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
యూరప్‌లో ఒక షెడ్యూల్ షూటింగ్ బాకీ వున్న నితిన్ సినిమా ‘రంగ్ దే’ బృందం కూడా అక్టోబర్‌లో అక్కడకు చేరుకుని షూటింగ్ ముగించుకోవాలని చూస్తోంది. చూస్తోంటే లోకల్‌గా షూట్ చేయాల్సిన సినిమాలే ఆలస్యంగా సెట్స్‌కి వెళ్లేలా వున్నాయి.