నిఖిల్ సినిమాతో కళ్యాణ్‌ రామ్‌కు తలనొప్పి

‘కార్తికేయ-2’తో గత ఏడాది అనూహ్య విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు నిఖిల్. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు నిఖిల్ మరో పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు. అదే.. స్పై. ‘కార్తికేయ-2’ అనుకోకుండా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది కానీ.. నిజానికి దాన్ని రిలీజ్‌కు ముందు ఎవరూ బహు భాషా చిత్రంగా గుర్తించలేదు.

ఆ సినిమా అనుకోకుండా హిందీలో ఘనవిజయాన్ని అందుకోవడం ‘స్పై’కి అడ్వాంటేజ్ అయింది. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో గట్టిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. తాజాగా ‘స్పై’ టీజర్ కూడా రిలీజైంది. ‘కార్తికేయ-2’ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో పెద్ద బడ్జెట్లో భారీ స్థాయిలోనే ఈ సినిమాను తీర్చిదిద్దిన విషయం టీజర్ చూస్తే అర్థమైంది. ఐతే ఈ సినిమా కథాంశానికి.. తెలుగులో తెరకెక్కుతున్న మరో చిత్ర కథకు పోలికలు ఉన్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

విమాన ప్రమాదంలో చనిపోయినట్లు అందరూ భావించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విషయంలో అసలేం జరిగిందనే నేపథ్యంలో ఒక గూఢచారి చేసే సాహసాల నేపథ్యంలో ‘స్పై’ తెరకెక్కింది. కథ మొత్తంలో బోస్ కీలకంగా ఉంటాడని టీజర్లో చెప్పకనే చెప్పేశారు. ఐతే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘డెవిల్’ కథ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుందని అంటున్నారు. ఐతే అది వర్తమానంలో నడిచే కథ కాదని.. పీరియడ్ ఫిలిం అని చెబుతున్నారు.

అందులో కూడా హీరో గూఢచారే.. అక్కడ కూడా కథ సుభాష్ చంద్రబోస్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఇండస్ట్రీల ఈ రెండు కథల సారూప్యతల గురించి ఇప్పటికే పెద్ద చర్చ నడుస్తోంది. ఐతే ‘స్పై’ టీజర్ లాంచ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో నిఖిల్‌కు దీని గురించే ప్రశ్న ఎదురు కాగా.. ‘డెవిల్’కు, తమ సినిమాకు సంబంధం లేదని తేల్చేశాడు. ఆ కథ వేరు.. ఈ కథ వేరు అన్నాడు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ చర్చ ఆగట్లేదు.. ముందు రిలీజయ్యేది ‘స్పై’నే కావడంతో దాని వల్ల ‘డెవిల్’కు తలనొప్పి తప్పదని అంటున్నారు.