టాలీవుడ్లో అత్యధికంగా కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న సంగీత దర్శకుడు ఎవరు అంటే.. మరో మాట లేకుండా అందరూ తమన్ పేరే చెప్పేస్తారు. తాను అసలు కాపీయే కొట్టని.. కొట్టినా అది దర్శకుల కోరిక మేరకే అయి ఉంటుందని.. తమన్ ఎంత వివరణ ఇచ్చుకున్నా.. ఎంత కవర్ చేసినా.. సోషల్ మీడియాలో మాత్రం తనపై ట్రోలింగ్ ఆగదు.
యూట్యూబ్‌లోకి వెళ్లి తమన్ కాపీ మ్యూజిక్, ట్యూన్స్ అని కొడితే.. పెద్ద లిస్టే వస్తుంది. ఒరిజినల్స్, అతను చేసిన పాటలు పక్క పక్కన పెట్టి పోల్చి మరీ.. తన తప్పుల్ని బయటపెట్టేస్తుంటారు నెటిజన్లు. పాటల ట్యూన్స్ అనే కాదు.. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ తమన్ మీద పలు కాపీ ఆరోపణలు ఉన్నాయి. ఉన్నదున్నట్లు దించేయకున్నా.. వేరే పాటలు, స్కోర్‌ను గుర్తుకు తెచ్చేలా అతడి వర్క్ ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ‘వీర సింహారెడ్డి’ సినిమాలోని ‘జై బాలయ్యా’ పాట.. ‘ఒసేయ్ రాములమ్మ’ పాటకు దగ్గరగా ఉండటం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే.
కట్ చేస్తే ఇప్పుడు తమన్ పని చేస్తున్న కొత్త సినిమా టీజర్‌కు ఇచ్చిన స్కోర్ విషయంలోనూ కాపీ ఆరోపణలు తప్పట్లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన కొత్త చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఈ రోజు రామ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు. ఇందులో బ్యాగ్రౌండ్లో వినిపించిన సాంగ్, స్కోర్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి.
కానీ కాసేపటికే ఆ ట్యూన్ ఒరిజినల్ కాదంటూ నెటిజన్లు ఆరోపణలు మొదలుపెట్టారు. తమిళ స్టార్ విజయ్ నటించిన ‘వేటైకారన్’ సినిమాలో హీరోకు ఎలివేషన్ ఇస్తూ ఒక బిట్ సాంగ్ ఉండగా దాని స్ఫూర్తితోనే తమన్.. బోయపాటి-రామ్ సినిమా టీజర్‌కు స్కోర్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. రెండూ వింటే పోలికలు కచ్చితంగా ఉన్నాయనిపిస్తోంది. ఈ విషయంలో నెటిజన్లు ఆల్రెడీ తమన్‌ను టార్గెట్ చేసి వాయించేస్తున్నారు. మరి తమన్ ఈ ఆరోపణలపై ఏమని బదులిస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates