102 సెంట‌ర్ల‌లో 200 రోజులు

శత దినోత్సవం, ర‌జ‌తోత్స‌వం.. ఈ మాటలు వింటే కామెడీగా చూసే ప‌రిస్థితులు వ‌చ్చేశాయి ఇప్పుడు. ఈ రోజుల్లో. ఏదైనా సినిమా ఒక్క థియేటర్లో వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్నా.. అది నిజమైన ఘనతగా భావించట్లేదు. పనికట్టుకుని ఆడిస్తే తప్ప మన దగ్గర ఏ సినిమా కూడా వంద రోజులు ఆడే పరిస్థితి లేదు. పెద్ద హిట్ అనిపించుకున్న సినిమాలు అతి కష్టం మీద కొన్ని థియేటర్లలో 50 రోజులు ఆడుతున్నాయంతే.

ఇలాంటి టైంలో మన సినిమా ఒకటి వేరే దేశంలో రెండొందలకు పైగా సెంటర్లలో వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడం, వంద‌కు పైగా సెంట‌ర్ల‌లో రెండొంద‌ల రోజులు ఆడ‌టం అన్నది అనూహ్యమైన విషయం. ఈ ఉపోద్ఘాతం అంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించే అని ఈపాటికే అర్థమై ఉంటుంది. గ‌త ఏడాది అక్టోబ‌రులో జ‌పాన్‌లో ఆర్ఆర్ఆర్‌ సినిమాను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేసింది రాజ‌మౌళి అండ్ టీం.

అప్ప‌ట్నుంచి ఈ సినిమా వ‌సూళ్ల మోత మోగిస్తూ సాగిపోతోంది. జ‌పాన్‌లో ఆర్ఆర్ఆర్ థియేట్రిక‌ల్ ఎంత‌కీ ముగియ‌ట్లేదు. మూడు నెల‌ల కింద‌ట 200కు పైగా సెంట‌ర్ల‌లో ఆర్ఆర్ఆర్ వంద రోజుల ప్ర‌ద‌ర్శ‌న పూర్తి చేసుకుంద‌ని తెలిసి అంద‌రూ షాక‌య్యారు. ఆ త‌ర్వాత కూడా ఆ సినిమా ర‌న్ కొన‌సాగించింది. ఇప్పుడు ఏకంగా 102 సెంట‌ర్ల‌లో ఆర్ఆర్ఆర్ జ‌ప‌నీస్ వెర్ష‌న్ 200 రోజుల ప్ర‌ద‌ర్శ‌న‌ను పూర్తి చేసుకుంది.

ఇండియాలో కూడా ఇప్ప‌టిదాకా ఏ సినిమా ఇన్ని సెంట‌ర్ల‌లో 200 రోజులు ఆడిన చ‌రిత్ర లేదు. దీన్ని బ‌ట్టే ఆర్ఆర్ఆర్ జ‌పాన్‌లో ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవ‌చ్చు. బాహుబ‌లిని మించి అక్క‌డ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది ఈ సినిమా. వ‌సూళ్లు అక్క‌డ బిలియ‌న్ యాన్‌ల మైలురాయిని ఎప్పుడో దాటేశాయి. 400 మిలియ‌న్ యాన్ల‌తో ఎన్నో ఏళ్ల కింద‌ట ముత్తు సినిమా నెల‌కొల్పిన అత్య‌ధిక వ‌సూళ్ల ఇండియ‌న్ సినిమా రికార్డును ఆర్ఆర్ఆర్ ఎప్పుడో చెరిపేసింది.