ఎక్కడైనా బావే కానీ వంగతోట తోట కాదనే నానుడిని కొందరు ఆర్టిస్టులు తూచా తప్పకుండా పాటిస్తారు . మాములుగా సినిమాల్లో నటించగానే క్యాస్టింగ్ పని పూర్తవ్వదు. అసలు సహకారం ప్రమోషన్ల టైంలో అందించాలి. ఆర్ఆర్ఆర్ కోసం ఏడాది పాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు తమ పనులు షూటింగులు ఆపుకుని మరీ రాజమౌళి వెంట వెళ్లినందుకే ఆ స్థాయిలో గుర్తింపు రీచ్ వచ్చింది. బలగం లాంటి చిన్న సినిమా అయినా పొన్నియిన్ సెల్వన్ లాంటి మల్టీస్టారర్ అయినా రాష్ట్రాలు దాటి బయటికి వెళ్లి పబ్లిసిటీలో భాగం కావాల్సిందే. నిర్మాతకు తోడ్పడాల్సిందే
తమిళ విజయ్, నయనతారలు ఎంత నెత్తినోరు బాదుకున్నా ఈ విషయంలో ససేమిరా అంటారు. దిల్ రాజు అంతటి సీనియర్ నిర్మాతే వారసుడు ఈవెంట్ కి విజయ్ ని హైదరాబాద్ తీసుకురాలేకపోయారు. ఇక నయన్ సంగతి తెలిసిందే. చిరంజీవి అయినా చిన్న హీరో అయినా ఎవరికైనా నో అనేస్తుంది. తాజాగా కస్టడీ ప్రమోషన్లు మంచి స్వింగ్ లో ఉన్నాయి. నాగ చైతన్య ఎడతెరిపి లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సమంతా గురించి అడిగినా సరే హుందాగా సమాధానం చెబుతూ కస్టడీలో కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ని పలు రూపాల్లో వ్యక్తం చేస్తూనే ఉన్నాడు.
దర్శకుడు వెంకట్ ప్రభు, హీరోయిన్ కృతి శెట్టి, ముఖ్యమైన పాత్ర చేసిన ప్రియమణి అందరూ వీటిలో భాగమవుతున్నారు. కానీ అసలైన విలన్ అరవింద్ స్వామి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కస్టడీకి హైప్ వచ్చే క్రమంలో చైతు తర్వాత ఆకట్టుకున్న పాయింట్ అరవింద్ స్వామి ఉండటమే. షూటింగులతో బిజీగా ఉండటంతో పాటు ఈ ప్రమోషన్ల హంగామా దూరంగా ఉండాలనే కట్టుబాటు వల్లే రాలేదని యూనిట్ టాక్. ఏదైనా అతను వచ్చి అంతో ఇంతో కెమెరా ముందు మాట్లాడితే ఇంకాస్త పాజిటివ్ ఫ్యాక్టర్ తోడయ్యేది. ఇంకో మూడు రోజులే ఉంది కాబట్టి అతన్నుంచి ఆశించలేం