మాస్ మహారాజా రవితేజ జోరు ఇటీవల బాగా తగ్గింది. అతని సినిమాలకు పది కోట్ల షేర్ కూడా రాని పరిస్థితి వచ్చేసింది. ఈ లాక్డౌన్లో తన కెరీర్ని పునఃసమీక్షించుకునే అవకాశం రవితేజకు దక్కింది. అందుకే ఈ లాక్డౌన్ వేళ తన భవిష్యత్ ప్రణాళికపై రవితేజ దృష్టి పెట్టాడు. ప్రస్తుతం హీరోలంతా తక్కువ సినిమాలు చేస్తూ వుండడం వల్ల మార్కెట్లో వెలితి ఏర్పడుతోంది.
రవితేజ ఆ వాక్యూమ్లో తన స్పేస్ కోసం చూస్తున్నాడని తెలిసింది. క్రాక్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో వుంది. షూటింగ్స్ మళ్లీ మొదలయిన తర్వాత క్రాక్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత తాను చేయబోయే అయిదు చిత్రాలను రవితేజ క్యూలో పెట్టినట్టు తెలిసింది. తన మార్కెట్ డౌన్ అయినా కానీ రవితేజ చిత్రాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ బాగా వస్తాయి. అందుకే పారితోషికం పరంగా ఇంత అంటూ నిర్మాతపై భారం వేయకుండా హిందీ రైట్స్ తనకు పారితోషికంగా ఇచ్చేయమని అడుగుతున్నాడట.
రవితేజ పారితోషికం లేకపోతే అతని సినిమాను తక్కువ బడ్జెట్లో తీసేసుకునే వీలుంటుంది కనుక నిర్మాతలు కూడా ఇందుకు సుముఖంగానే వున్నారు. ఓటీటీలకు డిమాండ్ వుంది కనుక రవితేజ చిత్రాలకు ఓటీటీ ఆఫర్స్ కూడా బాగానే వస్తాయి కనుక థియేట్రికల్ షేర్ పది – పన్నెండు కోట్ల వరకు లెక్క కట్టుకున్నా డీసెంట్ సినిమా తీస్తే మనీ రిటర్న్ గ్యారెంటీ పెరుగుతుంది.