మొదటి భాగం కంటే రెండోది అత్యద్భుతంగా ఉంటుందని అసలైన కథని ఇందులోనే చూస్తారని తెగ ఊరించిన పొన్నియిన్ సెల్వన్ 2 సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. విమర్శకుల మెప్పు పొందినా సగటు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో మణిరత్నం తడబాటు పీఎస్ 1 కన్నా తక్కువ ఫలితాన్ని తెచ్చి పెట్టింది. పది రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ విజువల్ గ్రాండియర్ తెలుగులో ఇప్పటిదాకా వసూలు చేసిన షేర్ కేవలం 6 కోట్ల 40 లక్షలేనట. గ్రాస్ పదమూడు కోట్లు దాటింది కానీ బ్రేక్ ఈవెన్ ఇంకా దూరంలో ఉంది
పొన్నియిన్ సెల్వన్ 2 లాభాలు వచ్చాయని చెప్పుకోవాలంటే ఇంకో నాలుగు కోట్లకు పైగానే షేర్ అంతకు రెట్టింపు గ్రాస్ తేవాలి. కానీ దాదాపు అన్ని సెంటర్స్ లో విపరీతమైన డ్రాప్ ఉంది. వీక్ డేస్ లో లెక్కలు మరీ తక్కువగా ఉన్నాయి. ఏజెంట్ డిజాస్టర్ రిజల్ట్ ని పీఎస్ 2 వాడుకోలేకపోయింది. రామబాణం ఫెయిలైనా, ఉగ్రం అన్ని వర్గాలకు రీచ్ కాలేకపోయినా ఆ అవకాశం పొన్నియిన్ సెల్వన్ 2కి అనుకూలంగా మారలేదు. రివర్స్ లో విరూపాక్ష ఊపందుకుని నిన్నా మొన్నా మంచి వసూళ్లు సాధించడం గమనార్హం. మళ్ళీ స్క్రీన్లు పెంచడం మరో ట్విస్టు
రిలీజయ్యాక ముందే ఫలితం ఊహించిన మణిరత్నం టీమ్ పోస్ట్ విడుదల తర్వాత చేయాల్సిన సక్సెస్ మీట్లు ప్రమోషన్లు ఇతర భాషల్లో పూర్తిగా ఆపేసింది. తమిళ వెర్షన్ ఇప్పటిదాకా 140 కోట్లు వసూలు చేయగా ఇంకో 32 కోట్ల దాకా రావాల్సి ఉంది. పొన్నియిన్ సెల్వన్ 1 చూపించినంత దూకుడు దీనికి రాలేదన్నది వాస్తవం. బాహుబలి టైంలో బిగినింగ్ ని మించి ఎండింగ్ అరాచకం సృష్టించింది. అదే స్థాయిలో పీఎస్ కూడా రికార్డులు సృష్టిస్తుందని కోలీవుడ్ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకుంటే అవి ఫలించలేదు. అంతర్జాతీయంగానూ ఎలాంటి గుర్తింపు రాకపోవడం కొసమెరుపు