పెద్ద నిర్మాతలు.. చిన్న సినిమాల్ని ముందుకు నెడుతున్నారా?

మొన్న రాజమౌళి చెప్పాడు.. ఇప్పుడు అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు ఓపెన్ అయ్యారు. ఈ ఏడాది చివరి వరకు థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదని స్పష్టమవుతోంది. వీళ్లంతా కూడా కామన్‌గా చేసిన హెచ్చరిక.. చిన్న సినిమాలకు గడ్డు కాలం తప్పదనే. తక్కువ పెట్టుబడితో కష్టపడి ఏదోలా సినిమాను ముగించి.. బిజినెస్ చేసుకుని రిలీజ్ చేయడానికి నానా కష్టాలు పడుతుంటే.. లాక్ డౌన్ వచ్చి పడి సినిమాలు ల్యాబుల్లోనే మగ్గాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది.

నెలో రెండు నెలలో అయితే తట్టుకుని నిలబడొచ్చు కానీ.. ఆరేడు నెలలంటే చాలా కష్టమైపోతుంది. వడ్డీల భారం పెరిగితే పెట్టుబడి రెట్టింపవుతుంది. థియేటర్లు తెరుచుకున్నాక కూడా కొన్ని నెలల పాటు ఆశించిన రెవెన్యూ ఉండే అవకాశం లేదు. ఇంతకుముందే చిన్న సినిమాలకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం కష్టంగా ఉంది. మెయింటైనెన్స్‌కు తగ్గ రాబడి కూడా రావట్లేదు.

అలాంటిది పోస్ట్ కరోనా రిలీజ్ అంటే పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది. అందుకే చిన్న సినిమాలకు దిల్ రాజు, అరవింద్ లాంటి వాళ్లు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వడ్డీల భారాన్ని తట్టుకుని అన్ని సినిమాలూ నిలబడలేవన్నారు. ఓటీటీల్లో డైరెక్ట్‌గా రిలీజ్ చేసే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. పరిస్థితి చూస్తుంటే పెట్టుబడి వెనక్కి వస్తుందో రాదో కానీ.. చిన్న సినిమాలైతే థియేట్రికల్ రిలీజ్ మీద ఆశలు పెట్టుకోవడం కష్టమే అనిపిస్తోంది.

కష్టమో నష్టమో ఓటీటీల్లో రిలీజ్ చేసేసుకోవడమే బెటర్ అంటున్నారు. ఓటీటీల్లో రిలీజ్ కోసం ప్రచారం గట్టిగా చేసి అక్కడ రెస్పాన్స్ బాగుంటే.. శాటిలైట్ డీల్ కూడా చేసుకోవడానికి అవకాశముంది. కాబట్టి చిన్న సినిమాల నిర్మాతలు ఇంకొన్ని రోజులు పరిస్థితులు చూశాక కొంచెం గుండె దిటవు చేసుకుని ఓటీటీల్లో డైరెక్ట్ సినిమాల్ని రిలీజ్ చేయక తప్పని పరిస్థితి తలెత్తవచ్చంటున్నారు.