రెండేళ్ల కిందట కొవిడ్ టైంలో ‘జాతిరత్నాలు’ అనే చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. కొవిడ్ ప్రభావం ఇంకా కొనసాగుతున్న టైంలోనే ఎన్నో అనుమానాల మధ్య ఆ సినిమాను రిలీజ్ చేశారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం గగనంగా మారిన సమయంలో.. ఈ సినిమా కోసం మామూలుగా ఎగబడలేదు.
పేరుకే చిన్న సినిమా కానీ.. హౌస్ ఫుల్స్‌తో రన్ అయింది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గత కొన్నేళ్లలో ప్రేక్షకులు థియేటర్లలో విపరీతంగా నవ్వుకున్న సినిమాల్లో ఇదొకటి. ఐతే ఇలాంటి సినిమాను థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ అనుకున్నారట. ముఖ్యంగా స్వప్నకు అయితే ఈ సినిమా మీద అంత నమ్మకం కూడా లేదట. ఆ చిత్రాన్ని ప్రియాంక, ఆమె భర్త నాగ్ అశ్విన్ నమ్మినంతగా తాను నమ్మలేదని స్వప్న ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
కొవిడ్ కొనసాగుతున్న టైంలో ఓటీటీ నుంచి తమకు ఆఫర్ వచ్చిందని.. అది బ్రహ్మాండమైన ఆఫర్ అని.. సినిమాను అమ్మేద్దామా అని తాను సీరియస్‌గా ఆలోచించానని స్వప్న వెల్లడించింది. ఐతే నాగ్ అశ్వన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపింది.
‘‘మనకు వయసు ఉంది. తర్వాత అయినా సంపాదించుకోవచ్చు ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. లేదా ఫ్లాప్ అవుతుంది. సినిమా పోయినా పర్వాలేదు. థియేటర్లలో రిలీజ్ చేద్దాం’’ అని నాగ్ అశ్విన్ తనతో అనడంతో థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయినట్లు స్వప్న తెలిపింది.
ఇక ‘సీతారామం’ సినిమాను నాగ్ అశ్విన్, ప్రియాంకల కంటే తాను ఎక్కువ నమ్మానని.. ‘మహానటి’ సినిమాను తామందరం ఎంతో బాధ్యతగా తీశామని.. ఇవి కూడా అద్భుత ఫలితాలను అందుకున్నాయని స్వప్న చెప్పింది. తమ సంస్థ నుంచి ‘అన్నీ మంచి శకునములే’ మరో మంచి సక్సెస్ ఫుల్ సినిమా అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రం ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.