మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్టే. భోళా శంకర్ షూటింగ్ మంచి స్వింగ్ లో ఉన్న కారణంగా అఫీషియల్ ప్రకటన రాలేదు కానీ ప్రీ ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయని సమాచారం. అయితే ఇది మలయాళం మూవీ బ్రో డాడీకి రీమేక్ అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మరో యూత్ హీరో కోసం వెతుకులాట జరుగుతోంది కాబట్టి ఈ వార్తకు మరింత బలం చేకూరుతోంది. విజయ్ దేవరకొండ లేదా సిద్దు జొన్నలగడ్డలో ఒకరిని లాక్ చేసే దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రావొచ్చు.
బ్రో డాడీ ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్ నటించారు. కొడుకుగా పృథ్విరాజ్ సుకుమారన్ చేశారు. పెళ్లీడుకొచ్చిన వారసుడిని పెట్టుకుని భార్యని గర్భవతిని చేసే నడివయసు తండ్రి కథ ఇది. మంచి కామెడీతో పాటు బలమైన ఎమోషన్స్ ఉంటాయి. వినడానికి పాయింట్ కొంచెం విచిత్రంగా అనిపించినా ట్రీట్ మెంట్ లో అలాంటి ఫీలింగ్ రాకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు పృథ్విరాజ్. కరోనా టైంలో థియేటర్లకు రాకుండా హాట్ స్టార్ లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ జరుపుకుంది. ఆడియన్స్ నుంచి మంచి స్పందనతో పాటు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.
మరి నిజంగా చిరు ఇదే చేయబోతున్నారా లేదా అనేది వేచి చూడాలి. వయసు తగ్గ పాత్రల కోసం చూస్తున్న మెగాస్టార్ ఇప్పటికీ సగటు కమర్షియల్ జానర్ కే కట్టుబడ్డారు శృతి హసన్, తమన్నా, నయనతార లాంటి హీరోయిన్ల జట్టు కడుతున్నారు. వెంకటేష్ తరహాలో ఏదైనా ప్రయోగం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోనే బ్రో డాడీని ఎంచుకున్నట్టు వినికిడి. ఇంకా నిర్ధారణ లేదు కానీ అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. గత ఏడాది గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో వసూళ్లు తేలేదు. ఇప్పుడు మళ్ళీ మరొక కేరళ రీమేక్ అంటే ఆందోళన ఉంటుందిగా. వేచి చూద్దాం