దసరా దర్శకుడికి స్నేహితులే ప్రపంచం

ఎన్నడూ లేనిది న్యాచురల్ స్టార్ నానిని ఊర మాస్ అవతారంలో చూపించి దసరా రూపంలో డెబ్యూతోనే వంద కోట్ల బ్లాక్ బస్టర్ అందుకోవడమంటే మాటలు కాదు. రిలీజై నెల రోజులు దాటేసి నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చాక కూడా చాలా చోట్ల విరూపాక్ష తర్వాత ఆడియన్స్ కి దసరానే నెక్స్ట్ ఛాయస్ గా నిలుస్తోంది. దీన్ని బట్టి ఎంత స్ట్రాంగ్ రన్ దక్కిందో అర్థం చేసుకోవచ్చు. మైకు ముందు పెద్దగా మాట్లాడే అలవాటు లేని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల జీవితంలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యంగా స్నేహితుల గురించి ప్రస్తావించాడు

ఇంటర్ పూర్తి చేశాక చదువుల మీద అంతగా ఆసక్తి లేని శ్రీకాంత్ స్నేహితుల ప్రోత్సాహంతో నేరుగా హైదరాబాద్ వచ్చేశాడు. సుకుమార్ జగడం అతన్ని అంతగా కదిలించింది. పట్టుబట్టి ఆయన వద్దకే వెళ్లి వద్దంటున్నా వెంటపడి రెండే సినిమాలకు పని చేస్తాననే హామీ మీద నాన్నకు ప్రేమతో, రంగస్థలంకు టీమ్ లో భాగమయ్యాడు. ఆ తర్వాత చిన్నప్పుడు బొగ్గు దొంగతనాలను చేసే బాబాయ్ ని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న దసరా కథను నిర్మాత సుధాకర్ చెరుకూరి, నానిలకు వాళ్ళ ద్వారా కీర్తి సురేష్ కు వినిపించడం వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేయడం చకచకా జరిగిపోయాయి.

ఈ మొత్తం ప్రయాణంలో శ్రీకాంత్ వెంట ఉన్నది ఫ్రెండ్సే. రోహిత్, శ్రవణ్, శ్రీనాథ్, హరి ఇలా మొత్తం పది మంది రూమ్ మేట్స్ గా ఉన్నప్పటి నుంచి తనకు అండగా ఉంటూ సినిమా ట్రయిల్స్ కు సహకరించారు. ఇప్పటికీ అందరూ కలిసి ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నారు. బట్టలు కూడా విడిగా వాడుకోరు. అందరూ ఒకే వయసు కావడంతో నచ్చినవి వేసుకుంటూ పోవడమే. అన్నట్టు శ్రీకాంత్ చేతిలో డబ్బులు ఉండవట. అన్నీ ఫ్రెండ్సే చూసుకోవడంతో తన జీతం, పారితోషికం అంతా వాళ్ళ అకౌంట్లలోనే వేయించేవాడు. అన్నట్టు మే 31న ఈ నయా దర్శకుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు