షారుఖ్ కోసం ఖైదీ వేటను వాడేశారా

మొన్న జనవరిలో పఠాన్ రూపంలో వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుని కంబ్యాక్ ని ఘనంగా జరుపుకున్న షారుఖ్ ఖాన్ త్వరలో జవాన్ గా రాబోతున్నాడు. కోలీవుడ్ ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో నయనతార హీరోయిన్, విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేశారని ముంబై టాక్. ముందు ప్రకటించిన ప్రకారం జూన్ లో విడుదల చేయాలా వద్దానే విషయంలో టీమ్ తర్జన భర్జనలు పడుతోంది. దీపావళికి వెళ్లే ప్రతిపాదన చర్చల దశలో ఉందని సమాచారం.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం జవాన్ ఒక కమల్ హాసన్ సినిమాని స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న కథట. వివరాల్లోకి వెళ్తే 1985లో తమిళంలో ఓరు ఖైదీయిన్ డైరీ వచ్చింది. భారతీరాజా డైరెక్షన్లో వచ్చిన ఈ రివెంజ్ డ్రామా అప్పట్లో బ్లాక్ బస్టర్. సిల్వర్ జూబ్లీ ఆడి రికార్డులు సొంతం చేసుకుంది. తెలుగులో ఖైదీ వేటగా డబ్బింగ్ చేస్తే ఇక్కడా మంచి విజయం దక్కింది. కృష్ణంరాజు తిరిగి ఇదే స్టోరీతో మరణ శాసనం చేశారు కానీ ఆడలేదు. హిందీలో అమితాబ్ బచ్చన్ తో భారతీరాజానే మళ్ళీ రీమేక్ తీస్తే సూపర్ హిట్ గా నిలిచి క్లాసిక్స్ జాబితాలో చేరింది. దీని ట్రాక్ రికార్డు అంతుంది.

భార్యను చంపి తనకు యావజ్జీవ శిక్ష పడేలా చేసిన పెద్దమనుషుల మీద ప్రతీకారం తీర్చుకునే వృద్ధుడి కథ ఇది. పోలీస్ ఆఫీసరైన కొడుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. మక్కికి మక్కి కాకపోయినా ఇదే పాయింట్ ని తీసుకుని దానికి సోషల్ మెసేజ్ జోడించి అట్లీ జవాన్ ని తీర్చిదిద్దుతున్నట్టు వినికిడి. ఇతని స్టయిలే అంత. తేరిని కూడా విజయ్ కాంత్ క్షత్రియుడు నుంచి తెలివిగా ఎత్తేశాడు. ఇప్పుడు జవాన్ విషయంలోనూ అలాగే జరిగినా ఆశ్చర్యం లేదు. షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత డ్యూయల్ రోల్ కనిపించబోతున్నారని నెలల క్రితం వచ్చిన టాక్ నిజమేనన్న మాట.