తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని దశ దిశలా చాటిన అన్నగారు ఎన్టీఆర్ శత జయంతిని గత ఏడాది మే 28 నుంచి రాష్ట్రం, దేశ విదేశాల్లోనూ నిర్వహిస్తున్నారు.అయితే.. ఇప్పుడు నేటి నుంచి(ఏప్రిల్ 28) వచ్చే నెల అన్నగారి 100వ జయంతి(మే 28) వరకు ఊరూవాడా ఘనంగా నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా విజయవాడ శివారులో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
అయితే.. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. నిజానికి ఎంతో మంది ఎన్టీఆర్‌తో కలిసి నటించిన వారు ఉన్నా.. రజనీని పిలవడానికి ప్రత్యేక కారణం.. ఉంది. రజనీ ఇంట్లో నిలువెత్తు ఎన్టీఆర్ చిత్రపటం ఉండడమే కాకుండా.. సినీరంగంలో ఇప్పటికీ ఎన్టీఆర్ వేసిన దారుల్లోనే రజనీ నడుస్తున్నారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
దీంతో టీడీపీ నుంచి ఆహ్వానం అందగానే.. రజనీ కాంత్ విజయవాడలో వాలిపోయారు. ఇక, ఎన్టీఆర్‌తో రజనీ కలిసి నటించిన సినిమాలు రెండే రెండు. ఒకటి టైగర్. ఇది పూర్తిగా తెలుగు సినిమా అయితే.. రెండో మణ్ణన్ వాణి(నిండు మనిషి) అనే తమిళ సినిమా. ఈ రెండు సినిమాలతోనే ఇద్దరి మధ్య గాఢానుబంధం ఏర్పడింది. నిర్మాతకు విలువ ఇవ్వడం.. గౌరవం ఇవ్వడం.. నిర్మాతలను వేధించకుండా.. ఉండడం వంటివి అన్నగారి నుంచి తాను నేర్చుకున్నానని.. అనేక సందర్భాల్లో రజనీ చెప్పారు. వాటినే ఇప్పటికీ ఆయన పాటిస్తున్నారు.
ఇక, విజయవాడ చేరుకున్న రజనీకాంత్‌కు.. నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. వెంటనే ఆయన విజయవాడలోని ఓ హోటల్ కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బాలయ్యతో కలిసి.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్తారు. అక్కడ తేనీటి విందు తీసుకున్నాక.. సాయంత్రం 6 గంటలకు అందరూ కలిసి.. విజయవాడ లో నిర్వహించే అన్నగారి శతజయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.