అఖిల్ సేఫ్ అవ్వాలంటే ఎంత తేవాలి?


అక్కినేని అఖిల్ తన కెరీర్లో అతి పెద్ద బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అతడి కొత్త సినిమా ‘ఏజెంట్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అఖిల్ గత సినిమాల ఫలితాలు, వసూళ్లు, బిజినెస్ ఇవేవీ పట్టించుకోకుండా అనిల్ సుంకర ఈ చిత్రం మీద ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టేయడం ఆశ్చర్యకరం. పైకి చెబుతున్నట్లు నిజంగా 80 కోట్లకు కాకున్నా.. ప్రోమోల్లో క్వాలిటీ చూస్తే మాత్రం 50-60 కోట్లకు తక్కువ ఖర్చయినట్లు అయితే అనిపించడం లేదు.

ఇప్పటిదాకా అఖిల్ నాలుగు సినిమాలు చేస్తే అందులో మూడు డిజాస్టర్లు, ఇంకోటి యావరేజ్ అయ్యాయి. ఇలాంటి ట్రాక్ రికార్డున్న హీరోకు రూ.80 కోట్ల బడ్జెట్ అంటే మోయలేని భారమే. బడ్జెట్‌కు తగినట్లు అయితే సినిమాకు బిజినెస్ కాలేదు. కానీ అఖిల్ ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే బిజినెస్ బెటర్‌గా జరిగినట్లే. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.36.2 కోట్లకు అమ్మారట అనిల్ సుంకర.

ఆ లెక్కల్ని ఒకసారి పరిశీలిస్తే.. నైజాం ఏరియాకు ‘ఏజెంట్’ హక్కులను రూ.10 కోట్లకు అమ్మారు. ఈ ఏరియాలో అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇక రాయలసీమ హక్కులు రూ.4.5 కోట్లు పలికితే.. ఆంధ్రాలో అన్ని ఏరియాలూ కలిపి రూ.14.80 కోట్లకు అమ్ముడయ్యాయి. ఏపీ, తెలంగాణల్లో కలిపి ‘ఏజెంట్’ రూ.29.3 కోట్లు బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ.3.8 కోట్లు పలికాయి. ఓవర్సీస్ రైట్స్ రూ.3.1 కోట్లకు అమ్మారు.

మొత్తంగా వరల్డ్ వైడ్ ‘ఏజెంట్’ థియేట్రికల్ హక్కుల వాల్యూ రూ.36.2 కోట్లన్నమాట. అంటే ఈ సినిమా థియేటర్ల నుంచి రూ.37 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అయినట్లు. గ్రాస్ కలెక్షన్లు రూ.60 కోట్ల దాకా రావాల్సి ఉంటుంది. అఖిల్ కెరీర్లో ఇప్పటిదాకా హైయెస్ట్ బిజినెస్ చేసింది అతడి తొలి చిత్రం ‘అఖిల్’యే. దానికి అప్పట్లోనే రూ.42 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పుడు ‘ఏజెంట్’ రెండో స్థానంలో నిలిచింది.