లాక్ డౌన్ వల్ల సినిమాల షూటింగ్స్, రిలీజ్లు ఆగిపోయాయి కానీ.. కొత్త కొత్త కాంబినేషన్లు మాత్రం భలే కుదురుతున్నాయి. తరచుగా ఆసక్తికర ప్రాజెక్టులు అనౌన్స్ అవుతున్నాయి. ఇటీవలే కొరటాల శివ-అల్లు అర్జున్ కాంబినేషన్లో కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీని కంటే ముందు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాని కంటే ముందు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని కూడా ఈ సంస్థ అనౌన్స్ చేసింది.
కాగా తాజాగా ఈ సంస్థ మరో భారీ చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నగరం, ఖైధి లాంటి సినిమాలతో సత్తా చాటుకుని.. ప్రస్తుతం అగ్ర కథానాయకుడు విజయ్‌తో ‘మాస్టర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న లోకేష్ కనకరాజ్‌ను మైత్రీ సంస్థ లాక్ చేసినట్లు సమాచారం.
మైత్రీ సంస్థ ముందు నుంచి నటీనటులు, టెక్నీషియన్ల విషయంలో టాలీవుడ్‌కు పరిమితం కావడం లేదు. ప్రశాంత్ నీల్‌తో కమిట్మెంట్ తీసుకోవడం కూడా ఇందులో భాగమే. తమిళ దర్శకుడు అట్లీని కూడా ప్రయత్నించారు కానీ కుదర్లేదు. ఈలోపు లోకేష్ ఈ సంస్థకు కమిట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఇంకా ఈ చిత్రానికి హీరో ఖరారవ్వలేదు. ఓ అగ్ర కథానాయకుడితో మల్టీ లాంగ్వేజ్ సినిమా కోసం లోకేష్‌కు మంచి ఆఫర్ ఇచ్చారట మైత్రీ అధినేతలు.
అవకాశాన్ని బట్టి పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్.. ఈ ముగ్గురిలో ఒకరితో ఈ సినిమా ఉండొచ్చని సమాచారం. రెండు సినిమాలకే విజయ్ లాంటి అగ్ర కథానాయకుడితో సినిమా చేసే అవకాశం దక్కించుకుున్న లోకేష్.. ‘మాస్టర్’తో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. అతడికి సొంత భాషలో మంచి డిమాండ్ ఉండగా.. మైత్రీ అతణ్ని లాక్ చేయడం విశేషమే.