యూత్ హీరోల మధ్య పోలీస్ యుద్ధం

ఈ మధ్య యూత్ హీరోలకు పోలీస్ కథల మీదకు మనసు లాగుతోంది. ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ కి అవకాశం దక్కడంతో పాటు సోషల్ మెసేజ్ పొందుపరిచే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైనా నచ్చేలా స్టోరీ చెబితే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. ఒకప్పుడు రాజశేఖర్, బాలకృష్ణ లాంటి ఒకరిద్దరు పెద్ద స్టార్లు మాత్రమే ఖాకీ బట్టలకు నప్పేవారు. ఇప్పుడందరూ ఓసారి ట్రై చేస్తే పోలా అనే అభిప్రాయానికి వచ్చేశారు. రవితేజ క్రాక్ బ్లాక్ బస్టర్ అయ్యాక ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఆ మధ్య ది వారియర్ చేశాడు కానీ దారుణంగా ఫెయిలయ్యింది.

వచ్చే నెల కేవలం వారం గ్యాప్ లో అల్లరి నరేష్, నాగ చైతన్యలు పోలీస్ యునిఫార్మ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. నాంది కాంబినేషన్ లో మే 5న వస్తున్న ఉగ్రం మీద భారీ అంచనాలేం లేవు కానీ దాని తరహాలో స్లీపర్ హిట్ అవుతుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. దీని కోసమే నరేష్ ఎన్నడూ లేనిది మొదటిసారి జుత్తుని చాలా కురచగా కత్తిరించుకుని రిస్క్ చేశాడు. ట్రైలర్ చూస్తే కిడ్నాప్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన రివెంజ్ డ్రామాగా అనిపించింది. దర్శకుడు విజయ్ కనకమేడల టేకింగ్ తో రెండోసారి ఏదైనా మేజిక్ చేస్తాడేమో చూడాలి.

ఇక చైతు కస్టడీ మే 12 వస్తుంది. ఇందులో హీరో పోలీస్ కానిస్టేబుల్. అన్యాయం జరిగితే ఎంత దూరమైనా వెళ్లే నిజాయితి పరుడిగా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశాడు. టిపికల్ స్క్రీన్ ప్లేతో షాక్ ఇస్తాడని పేరున్న దర్శకుడు వెంకట్ ప్రభు నుంచి ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మానాడు తర్వాత ఆయన చేస్తున్న మూవీ ఇదే. టాలీవుడ్ డెబ్యూ కావడంతో చాలా జాగ్రత్తలే తీసుకున్నాడు. ఉగ్రం, కస్టడీ రెండూ సీరియస్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతాయి. నవ్వించే ఎంటర్ టైన్మెంట్ పెద్దగా ఉండదు. మరి యూత్ హీరోలు ఏ మేరకు మెప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.