ఒక సినిమా మీద ప్రేక్షకులకు ఒక అంచనా రావడంలో అత్యంత కీలక పాత్ర ట్రైలర్‌దే. రిలీజ్ ముంగిట రిలీజ్ చేసే ఈ ప్రోమోను బట్టి సినిమా ఎలా ఉంటుందో ప్రేక్షకులకు అర్థం అయిపోతుంది. చాలా వరకు దర్శకులు మనం చూడబోయే సినిమా ఎలాంటిదో.. అందులో కథ ఎలా ఉండబోతోందో ట్రైలర్ ద్వారా హింట్ ఇస్తారు. సినిమాలోని హైలైట్లు ఏంటో కూడా అర్థం అయిపోతుంది ట్రైలర్ చూస్తే.
కొన్ని సినిమాలకు ట్రైలర్ల వల్లే మంచి హైప్ రావడం, ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం జరిగింది. అదే సమయంలో ట్రైలర్ బాగా లేకపోవడం వల్ల సినిమా మీద ఆసక్తి కోల్పోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలా రెండు రకాల ట్రైలర్లకూ ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఐతే పాజిటివ్ ట్రైలర్ వల్ల జరిగే మేలు కంటే.. బ్యాడ్ ట్రైలర్ వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. గోపీచంద్ కొత్త చిత్రం ‘రామబాణం’ ట్రైలర్ రెండో కోవకే చెందుతుందని చెప్పాలి.
ఇంతకుముందు లక్ష్యం, లౌక్యం లాంటి బ్లాక్‌బస్టర్లు ఇచ్చిన గోపీచంద్, శ్రీవాస్ కలయికలో తెరకెక్కిన ‘రామబాణం’ మీద మాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మిగతా ప్రేక్షకులను కూడా ఈ కాంబినేషన్ ఎగ్జైట్ చేసేదే. ‘లక్ష్యం’ అనేక ట్విస్టులతో, ఆసక్తికర కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘లౌక్యం’కు కామెడీ పెద్ద ఎసెట్ అయింది. కానీ ‘రామబాణం’ ఈ రెండు విషయాల్లోనూ నిరాశ పరిచేలా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తే కామెడీకి స్కోపే కనిపించలేదు. ఇక ఈ సినిమాలో ట్విస్టులు, కొత్తదనం లాంటివి ఆశించడానికి వీల్లేదని ట్రైలర్ చూస్తే స్పష్టంగా తెలిసిపోయింది. ట్రైలర్లో ఎంత వెతికినా కొత్త అంశం ఏమీ కనిపించలేదు. డైలాగులు సహా అన్నీ ఒక ఔట్ డేటెడ్ ఫీల్‌తో సాగాయి.
గోపీచంద్ ఇలాంటి సినిమాలు ఎన్ని చేస్తాడు.. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు ఎవరు చూస్తారు అనే ఫీలింగ్ కలిగింది ట్రైలర్ చూస్తే. మరి సినిమాలో ట్రైలర్‌ను మించి ఏమైనా సర్ప్రైజింగ్ అంశాలు ఏమైనా ఉంటాయేమో చూడాలి. మొత్తానికి ట్రైలర్ అయితే ‘రామబాణం’కు చాలా వరకు మైనస్సే అయిందని చెప్పాలి.