శ్రీదేవిని సేవ్ చెయ్యటానికి గన్ తీసాను..

‘క్షణ క్షణం’ షూటింగ్ ..ట్రైన్ మీద ఒక ఎపిసోడ్ వుంది.. హీరో వెంకటేష్ హీరోయిన్ శ్రీదేవి.. ఫైట్ మాష్టర్ హార్స్ మెన్ బాబు.. ఫైటర్స్..గోపాల్రెడ్డి..రామ్ గోపాల్ వర్మ..మిగతా యూనిట్ అంతా నంద్యాల లో ట్రైన్ ఎక్కి..ట్రైన్ మీద షూటింగ్ చేసుకుంటూ ‘దిగువ మెట్ట’ ఆనే స్టేషన్ కి చేరుకునే సరికి సాయంకాలం 5 గంటలు అయ్యేది.

లంచ్ కూడ ట్రైన్ లోకి తెచ్చే వాళ్లు ప్రొడక్షన్ టీమ్…ట్రైన్ ఒక చోట ఆగదు కాబట్టి జనం తో ఇబ్బంది వుండేది కాదు..కాని ‘దిగువ మెట్ట’ లో దిగి అందరూ కార్లు ఎక్కుతారు ఆనే విషయం ఆ చుట్టు పక్కల వూళ్ళ లో అందరికీ తెలిసి పోయింది.

రెండో రోజు షూటింగ్ ప్యాక్ అప్ చేసుకుని ట్రైన్ ‘దిగువ మెట్ట’ వచ్చేసరికి శ్రీదేవి ని చూడాలని చుట్టు పక్కల ఊళ్ళ నుండి జనం విపరీతం గా వచ్చేసారు. శ్రీదేవి ని చూడాలని అన్నీ బోగీ లు వెతుకు తున్నారు.. అప్పడు హీరో హీరోయిన్ లకు బౌన్సర్లు లు వుండేవారు కారు..వీళ్ల దృష్టి మళ్ళించ గలిగితే రెండు నిమిషాల లో తను ట్రైన్ దిగి కారు ఎక్కేయగలదు.

..ఒక ఆలోచన వచ్చింది.. షూటింగ్ లో వాడే డమ్మీ రివాల్వర్ ని తీసుకుని ప్లాట్ఫామ్ మీద ఒక చిన్న టవల్ పరిచి దాని మీద రివాల్వర్ ని వుంచి దాని వైపే చూడసాగాను..ఈలోగా ఉత్తేజ్ వచ్చాడు..ఎదో అడగ బోతే వారించి రివాల్వర్ వైపే చూడ మన్నాను..అంతే.. నెమ్మది గా ఒక్కొక్కరూ వచ్చి నా వైపు రివాల్వర్ వైపు చూడసాగారు..అందరి దృష్టి శ్రీదేవి మీద నుండి రివాల్వర్ మీద కు మళ్లింది…కృష్ణాష్టమి కి ఉట్టి కొట్టటానికి ఎక్కినట్టు ఒకరి మీద ఒకరు ఎక్కి రివాల్వర్ ని చూస్తున్నారు..

ఈలోగా ప్రొడక్షన్ మేనేజర్ లు కుర్రవాళ్లు కలిసి శ్రీదేవి ని తీసుకెళ్ళి కారు ఎక్కించారు..తరవాత రివాల్వర్ తీసి..టవల్ ని విదిలించి భుజాన వేసుకుని ఉత్తేజ్ నేను మా కారులో ఎక్కేసాము..అది పబ్లిక్ ని డైవర్ట్ చేయడం అంటే..

— శివ నాగేశ్వర రావు