శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్ సినిమాలు తీసే కమ్ముల.. తమిళంలో రకరకాల జానర్లలో సినిమాలు చేసే ధనుష్‌తో జత కడతాడని ఎవ్వరూ అనుకోలేదు. వీరి కలయికలో తెరకెక్కుతున్న కుబేర మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య విడుదలైన టీజర్ చూస్తే.. కమ్ముల ధనుష్ శైలికి నప్పే సినిమానే చేస్తున్నట్లు అనిపించింది.
కొంచెం బిచ్చగాడు సినిమా ఛాయలు కనిపించిన ఈ చిత్రంలో ధనుష్ బిలియనీర్‌గానే బిచ్చగాడి పాత్రలోనూ కనిపించనున్నాడు. ధనుష్ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కునే హీరో కాకపోయినా.. తన లాంటి స్టార్ బిచ్చగాడి పాత్ర చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ పాత్ర గురించి ధనుష్‌కు చెప్పడానికి తాను చాలా ఇబ్బంది పడినట్లు ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల వెల్లడించాడు. తొలిసారి తాను ధనుష్‌తో మాట్లాడినపుడు అతను తన గురించి చెప్పిన మాటలు తనకు పెద్ద షాక్ అని కమ్ముల తెలిపాడు.
కుబేర కథ సిద్ధమయ్యాక ధనుష్‌కు ఈ కథ చెబుదామనిపించింది. కానీ బిచ్చగాడి పాత్ర గురించి తనకు ఎలా చెప్పాలా అని సంకోచించా. ఇంతకీ నేనెవరో తనకు తెలుసో లేదో అని కూడా అనుమాన పడ్డా. కానీ ధనుష్‌కు ఫోన్ చేయగానే ఆయన నన్ను ఆశ్చర్యపరిచారు. నేను తీసిన వాటిలో ఫేవరెట్ సినిమాల గురించి.. వాటిలోని సీన్ల గురించి మాట్లాడ్డం మొదలుపెట్టారు. అది నాకు షాక్. ధనుష్ లాంటి మంచి నటుడితో పని చేయడం గొప్ప అనుభవం అని కమ్ముల తెలిపాడు.
ఇక హీరోయిన్ రష్మిక మందన్నా గురించి కమ్ముల స్పందిస్తూ.. రష్మిక ఈ సినిమాలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో కనిపిస్తుంది. ధనుష్, రష్మిక జంట స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. నేనీ కథ చెప్పడానికి రష్మికను కలిసినపుడు ముంబయిలో యానిమల్ సినిమాకు సంబంధించిన పనిలో ఉంది. అదే సమయంలో పుష్ప-2 షూటింగ్‌లోనూ పాల్గొంటోంది. ముంబయి టు హైదరాబాద్ విరామం లేకుండా తిరుగుతూ కూడా మళ్లీ మా సినిమా కోసం వచ్చి ఏమాత్రం నీరసం, అసహనం లేకుండా పని చేసింది అని శేఖర్ తెలిపాడు.