అమితాబ్, వెంకీల‌తో వ‌ర్మ భారీ సినిమా?

చాలా ఏళ్ల నుంచి నాసిర‌కం సినిమాలు తీస్తూ త‌న‌కున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని ద‌ర్శ‌కుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఐతే ఆయ‌న‌లో ఉన్న‌ట్లుండి ప‌శ్చాత్తాపం మొద‌లై.. రంగీలా, స‌త్య లాంటి సినిమాల త‌ర్వాత తాను స్థాయికి త‌గ్గ సినిమాలు తీయ‌క‌పోవ‌డం ప‌ట్ల ఇటీవ‌ల ట్విట్ట‌ర్ వేదికగా విచారం వ్య‌క్తం చేయ‌డం తెలిసిందే.

నిజంగా వ‌ర్మ‌లో ప‌శ్చాత్తాపం మొద‌లైందా అని సందేహిస్తున్న వాళ్లూ లేక‌పోలేదు కానీ.. ఆయ‌న నిజంగా త‌న త‌ప్పులు దిద్దుకుంటూ మంచి సినిమా చేస్తే బాగుంటుంద‌ని ఆశించే అభిమానుల సంఖ్య పెద్ద‌దే. ఇటీవ‌ల సందీప్ రెడ్డి వంగ సైతం మ‌ళ్లీ పాత రాము క‌నిపించేలా ఓ సినిమా తీయాల‌ని ఓ కార్య‌క్ర‌మంలో కోరితే.. నిజంగానే తాను ఆ ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు వ‌ర్మ చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఈ క్ర‌మంలోనే లేటెస్ట్ ట్విట్ట‌ర్ పోస్ట్ వ‌ర్మ అభిమానుల్లో ఆశ‌లు రేకెత్తించింది. ఐతే వ‌ర్మ నిజంగానే ఒక‌ప్ప‌టి స్థాయిలో ఓ భారీ చిత్రం చేయాల‌ని చూస్తున్నాడ‌న్న‌ది తాజా స‌మాచారం. స‌ర్కార్ లాంటి మ‌ర‌పురాని చిత్రం చేసిన అమితాబ్ బ‌చ్చ‌న్‌తో వ‌ర్మ మ‌ళ్లీ ఓ సినిమా చేయ‌నున్నాడ‌ట‌. వ‌ర్మ మీద అమితాబ్‌కు చాలా గురి ఉంది. స‌ర్కార్ త‌ర్వాత కూడా ఆయ‌న ఆగ్, స‌ర్కార్ రాజ్, నిశ్శ‌బ్ద్, ర‌ణ్ లాంటి సినిమాలు తీశాడు వ‌ర్మ‌. కానీ ఇవేవీ ఆడ‌లేదు.

ఆ త‌ర్వాత వ‌ర్మ అంటే అమితాబ్‌కు ప్ర‌త్యేక అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని ఉప‌యోగించుకోవాల‌ని వ‌ర్మ చూస్తున్నాడ‌ట‌. ఇదొక మ‌ల్టీస్టార‌ర్ మూవీ అని.. టాలీవుడ్ సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌ను సైతం ఈ సినిమా కోసం వ‌ర్మ సంప్ర‌దిస్తున్నాడ‌ని ఆయ‌న స‌న్నిహితుల స‌మాచారం.

పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బ‌డ్జెట్లో తీయాల‌నుకుంటున్నాడ‌ని, నిర్మాత‌ను కూడా రెడీ చేసుకున్నాడ‌ని.. మ‌ళ్లీ త‌న‌ను న‌మ్మి కోరుకున్న ఆర్టిస్టులు సినిమాకు ఓకే చెబితే త‌నేంటో చూపించాల‌ని వ‌ర్మ ప‌ట్టుద‌ల‌గా ఉన్నాడ‌ని స‌మాచారం. మ‌రి ఆయ‌న ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.