అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా నందమూరి బాలకృష్ణ చిత్రాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమనే సంగీతం అందించాడు. ప్రతిసారీ తన మ్యూజిక్ మోత మోగిపోతోంది. నందమూరి అభిమానులైతే తమన్‌కు మామూలు ఎలివేషన్ ఇవ్వట్లేదు. ఈ క్రమంలోనే అతను ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అంటూ కొనియాడుతున్నారు.
బాలకృష్ణ సైతం ఈ మాట అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే మాట బాలయ్య సోదరి, ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అనడం సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా నైట్ జరగనుంది. ఆ రోజు తమన్ టీం మ్యూజికల్ నైట్ నిర్వహించనుంది. దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వరితో పాటు తమన్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తన ప్రసంగంలో తమన్ గురించి మాట్లాడుతూ.. నందమూరి తమన్ అని వ్యాఖ్యానించారు భువనేశ్వరి. ఈ మ్యూజికల్ నైట్ ద్వారా నిధులు సేకరించి తలసేమియా బాధితుల కోసం ఉపయోగించనున్నట్లు, మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు భువనేశ్వరి వెల్లడించారు. ఇలా ఓ కార్యక్రమం చేద్దామనుకున్నపుడు తమన్ పేరే గుర్తుకు వచ్చిందని చెప్పిన భువనేశ్వరి.. వెంటనే సారీ తమన్ కాదు, నందమూరి తమన్ అనడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరిశాయి.
తమన్ సైతం సిగ్గుపడుతూ నవ్వుకున్నాడు. మరోవైపు తమన్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. తన ఛారిటీస్ గురించి ఈ సందర్భంగా అతను ప్రస్తావించాడు.
తాను సినిమాల ద్వారా వచ్చే డబ్బును మాత్రమే తనకోసం ఉపయోగిస్తానని.. సెలబ్రెటీ క్రికెట్ లీగ్, మ్యూజికల్ నైట్స్, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్నంతా సేవా కార్యక్రమాల కోసమే ఉపయోగిస్తానని.. ఇలా ఎప్పట్నుంచో చేస్తున్నానని.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం మ్యూజికల్ నైట్ చేయడానికి సిద్ధమయ్యానని చెప్పాడు తమన్.